
నవాజుద్దీన్ సిద్ధిఖీ
సాక్షి, ముంబై: తన జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తే దానిలో అభూత కల్పనలే ఉంటాయని బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు. ‘ఆన్ ఆర్డినరీ లైఫ్’ పేరిట గతేడాది తాను రాసిన ఆత్మకథలో ఐదు పేజీలు తన ప్రేమాయణం గురించి రాయడంపై విచారం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో తమ కలను సాకారం చేసుకునేందుకు చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్టు ‘బాలీవుడ్ హంగామా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
209 పేజీలున్న ఈ పుస్తకంలో 5 పేజీలు మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజ్‌వర్‌లతో సాగించిన ప్రేమాయణం గురించి నవాజుద్దీన్ పూసగుచ్చారు. సిద్ధిఖీ మొత్తం అబద్ధాలే చెప్పాడంటూ అతని మాజీ ప్రేయసిలు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఈ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు గతేడాది అక్టోబర్‌లో ప్రకటించారు. అంతేకాదు క్షమాణలు కూడా చెప్పారు.
ఈ వివాదం జరిగి ఏడాదైన సందర్భంగా మాట్లాడుతూ.. ‘పుస్తకంలో మొత్తం 209 పేజీలున్నాయి. కేవలం 5 పేజీల కారణంగా నా ప్రయత్నాన్ని వృధా చేస్తారా? నా ప్రేమకథను బయపెట్టినందుకు వివాదం చెలరేగుతుందని ఊహించలేదు. వాస్తవాలను చెప్పాలని మాత్రమే అనుకున్నాను. ఎవరి జీవితంలోనైనా వాస్తవం అనేది కథలా ఉండద’ని నవాజుద్దీన్ అన్నారు. ఇక ముందు తన జీవిత చరిత్ర రాస్తే అందులో అబద్దాలే ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment