రిటైర్మెంట్ తర్వాతే నా జీవితం మలుపు తిరిగింది | Turning point in my life after retirement | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ తర్వాతే నా జీవితం మలుపు తిరిగింది

Published Wed, Aug 20 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

రిటైర్మెంట్ తర్వాతే నా జీవితం  మలుపు తిరిగింది

రిటైర్మెంట్ తర్వాతే నా జీవితం మలుపు తిరిగింది

 రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా సరే రిలాక్స్ అయిపోయి కృష్ణా... రామా అనుకుంటారు. కానీ హాస్యనటుడు కొండవలస సినీ కెరీర్ మాత్రం రిటైర్మెంట్ ఏజ్ తర్వాతే మొదలైంది. ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అదేంటో, ఎలా జరిగిందో కొండవలసనే అడిగి తెలుసుకుందాం.
 
 ఎలా ఉన్నారు సార్?
 బావున్నానండీ.. అయితే... ఇంతకు ముందంత ఎక్కువ సినిమాలు చేయడం లేదు. యువతరం నటుల ఆగమనమే అందుకు కారణం. అయినా ఎప్పుడూ మనమే చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇలా అడపాదడపా నటించడం కూడా బావుంది. ఎందుకంటే... 68 ఏళ్లు వచ్చేశాయి. ఈ వయసులో నాకు ఆ మాత్రం విశ్రాంతి అవసరమే కదా!
 
 అందరికీ ఒకే జీవితం ఉంటుంది. కానీ రంగస్థల నటునిగా, సినీ నటునిగా దేవుడు మీకు రెండు జీవితాలిచ్చాడు. మీరేమంటారు?
 వందకు రెండొందల శాతం నిజం అంటాను. ఎందుకంటే.. నాకంటే ముందు రంగస్థలం నుంచి సినీ రంగానికి వచ్చిన నటులు చాలా మందే ఉన్నా... స్టేజ్‌ని సంపూర్ణంగా ఎంజాయ్ చేసింది మాత్రం నేనే. 1961లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతున్నప్పుడు ‘సవతి తల్లి’ నాటకంతో తొలిసారి రంగస్థలంపై అడుగుపెట్టాను. అందులో నాది ద్విపాత్రాభినయం. ఉత్తమ నటుడుగా అవార్డు కూడా అందుకున్నాను. అలా నటనా ప్రస్థానంలోని తొలి అడుగే విజయంతో మొదలైంది. ఓ వైపు వైజాగ్ పోర్ట్‌ట్రస్ట్‌లో క్లర్క్‌గా చేస్తూ, మరో వైపు 58 ఏళ్ల వయసు వచ్చే వరకూ నాటకాలు వేశాను. కుటుంబ బాధ్యతలన్నింటినీ తీర్చేసుకొని, ఉద్యోగానికి నా అంతట నేనే రిటైర్మెంట్ ప్రకటించి సినిమాల్లోకొచ్చాను. అంటే సినీనటునిగా ఇది నా రెండో జీవితం అన్నమాట.
 
 
 58 ఏళ్ల వయసులో స్టార్ అయ్యారు కదా! ఇంట్లోవాళ్లు, స్నేహితుల స్పందన ఏంటి?
 అదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. సినిమా యాక్టర్ అవుదామని నేను హైదరాబాద్ రాలేదు. మా అబ్బాయి కోడి రామకృష్ణగారి వద్ద సహాయకునిగా పనిచేస్తున్నాడు. వాడికి చేదోడు వాదోడుగా ఉండాలని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడకొచ్చాను. కానీ... అనుకోకుండా నా జీవితం మలుపు తిరిగింది. ఇంతటి అదృష్టం ఒక్కసారే సొంతం అయితే... ఇంట్లోవారి ఆనందానికి పట్టపగ్గాలుండవు కదా. అయితే... నాటకాల్లో నా సహచరులు మాత్రం నా ద్వారా వారూ పరిశ్రమకు రావాలని ప్రయత్నించారు. ఇక్కడి పరిస్థితులు వారికి తెలీదు కదా. ఏది ఏమైనా ఊరు కూడా అభినందించింది. గర్వించింది. ఇక అంతకంటే ఆనందం ఏముంది.
 
 అసలు ఎలా జరిగింది?
 నాకు 1999లోనే సినిమా ఆఫర్ వచ్చింది. వైజాగ్‌లో జరిగిన ఓ నాటక పరిషత్‌కి న్యాయనిర్ణేతలుగా జంధ్యాల, నూతన్‌ప్రసాద్ వచ్చారు. నా నాటకం చూసి జంధ్యాల చాలా మెచ్చుకుని, హైదరాబాద్ రమ్మన్నారు. ‘‘సార్... నాకు బాధ్యతలున్నాయి. దేవుడి దయవల్ల బదిలీలు లేని మంచి ఉద్యోగంలో ఉన్నాను. సినిమాలంటూ వెళితే ఉద్యోగానికి ఇబ్బంది. తద్వారా కుటుంబాన్ని సమస్యల్లో నెట్టినవాణ్ని అవుతాను’’ అని చెప్పాను. అది జరిగిన కొన్నాళ్లకే రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వెళ్లి జంధ్యాలగారికి ఫోన్ చేశాను. ‘రెండు మూడు నెలల్లో మన సీరియల్ మొదలవుతుంది. కబురొస్తుంది రెడీగా ఉండు’ అని చెప్పారు జంధ్యాల. నిజంగానే కబురొచ్చింది. వినకూడని కబురు. అదే... ‘జంధ్యాల ఇకలేరు’ అని. గుండె బరువెక్కింది. నా అదృష్టం ఇంతేలే అనుకున్నాను. కానీ...
 
 వంశీ రూపంలో దైవం నన్ను కటాక్షించింది. హైదరాబాద్ రావడానికి ముందు మూడేళ్ల క్రితం ద్రాక్షారామంలో ‘అల్లదే మా ఊరు’ అనే నాటిక ఆడాను. సాధారణంగా నాటకాల్లో నేను సీరియస్ పాత్రలే ఎక్కువగా వేస్తుంటాను. కామెడీ వేషాలు వేయడం అరుదు. తప్పని పరిస్థితుల్లోనే కామెడీ వేషాలు వేస్తాను. ఆ రోజు ‘అల్లదే మా ఊరు’ కోసం ఓ కామెడీ రోల్ చేయాల్సి వచ్చింది. అనుకోకుండా ఆ నాటకాన్ని వంశీగారు చూశారు. ‘నీ నాటకం బాలేదయ్యా... నీ యాక్టింగ్ మాత్రం బావుంది’ అని మెచ్చుకున్నారు. అప్పుడే ‘సినిమా అంటూ తీస్తే వీడికి ఓ వేషం ఇవ్వాల’ని మనసులోనే ఫిక్స్ అయిపోయారట వంశీ. అది జరిగిన మూడేళ్ల తర్వాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ మొదలుపెట్టి... నాకు కబురు పెట్టి ‘పొట్టిరాజు’ వేషం ఇచ్చారు.
 
 ‘నేనొప్పుకోను... ఐతే ఓకే...’ డైలాగ్ ఐడియా ఎవరిది?
 వంశీగారిదే. ‘నీ పెర్‌ఫార్మెన్స్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, వాయిస్... ఇలా అన్నీ వైవిధ్యంగా ఉండాలి’ అని ముందే చెప్పారు వంశీ. అందుకే.... ఓ భిన్నమైన స్టైల్‌లో ఆ పాత్ర పోషించాను. నా అదృష్టం... రాత్రికి రాత్రి ఆ సినిమా నన్ను స్టార్‌ని చేసింది. ఇక ఆ తర్వాత నా కెరీర్ అంతా మీకు తెలిసిందే.
 
 ఇక్కడ కమెడియన్లు ఎక్కువ కదా! మీ మధ్య సఖ్యత ఎలా ఉంటుంది?
 బావుంటుంది.. ఒకరి బాధల్లో ఒకరు పాలుపంచుకుంటాం. అందరూ అనుకుంటున్నట్లు ఇక్కడ రాజకీయాలు లేవు. ఈ మధ్య నాకు ఆరోగ్యం చెడింది. చాలా సీరియస్ అయ్యింది. అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మానందంగారు ప్రతి రోజూ నా యోగక్షేమాలు కనుక్కునేవారు. నిజంగా ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఎక్కడా ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement