నేను జుత్తు పెంచితే సినీ పరిశ్రమ ఒప్పుకోవడం లేదు!
శ్రీరమణను కలవడానికి వచ్చిన సుదర్శన్‌కి బాపు-రమణలు పరిచయమవడమేంటి? అంతా విష్ణుమాయ. ఇంజినీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన సుదర్శన్.. సినిమాల్లో కామెడీ వేషాలు వేయడమేంటి? అంతా విష్ణుమాయ. సూరంపూడి సుదర్శన్ కాస్తా... గుండు సుదర్శన్‌గా మారిపోవడమేంటి? అంతా విష్ణుమాయ. ఇలాంటి విష్ణుమాయలు సుదర్శన్ జీవితంలో చాలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. చదవండి.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి సార్?
ఆగడు, పవర్, పండగచేస్కో, అల్లుడు శీను... ఇవిగాక ఓ చిన్నా చితకా కలిసి ఓ అరడజను సినిమాలుంటాయి.
అంటే కెరీర్ మంచి స్పీడ్‌మీదున్నదనమాట?
ఇంకా బాగుండాలి... ఉన్నదాంట్లోనే సంతృప్తి పడిపోతే మీరన్నట్లు బాగుందనే అనాల్సొస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు కదా!
అంటే ఎలా ఉండాలంటారు?
ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఇక్కడకొస్తామండీ... ఈ మాత్రం కీర్తితో సరిపెట్టుకోలేం కదా! గుండు సుదర్శన్ అంటే.. ఇంకా ‘మిస్టర్ పెళ్లాం’ సినిమా గురించే చెబుతున్నారు. ఇప్పటికి దాదాపు రెండొందల పై చిలుకు సినిమాలు చేశాను. కానీ ఏం లాభం... ఒక నటునిగా సంతృప్తినిచ్చే పాత్ర మాత్రం దక్కడం లేదు.
పొరపాటు ఎక్కడ జరుగుతోందంటారు?
టైమ్ అంతే.. నిజానికి ఇప్పుడు సినిమా రంగం మొత్తం కామెడీపైనే ఆధారపడి ఉంది. చివరకు స్టార్ హీరోలు సైతం కామెడీ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వారి కోసం రచయితలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కామెడీ రాస్తున్నారు. అయితే... అలాంటి మంచి సన్నివేశాల్లో మా లాంటి వారికి మాత్రం స్థానం ఉండటం లేదు. అదే బాధ. మేం కూడా బాగా నటించగలమండీ..
అంటే పరిశ్రమలో ప్రోత్సాహం లేదంటారా?
అద్భుతమైన ప్రోత్సాహం ఉంది. అదే లేకపోతే రెండొందల సినిమాలు చేసుండేవాడినా? అయితే... ఇక్కడ స్టార్ స్టేటస్‌ని బట్టే పాత్రలు. నా లాంటి వారికి చిన్నా చితకా పాత్రలే దక్కుతాయి. నేనేంటో నిరూపించుకోవాలంటే అసలు అవకాశం రావాలి కదా.
ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
కామెడీనే కాదు, అన్ని రసాలూ పోషించగల సత్తా నాకుంది. కానీ పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని నాకు కామెడీ వేషాలే ఇస్తున్నారు. ఇదివరకు సినిమాల్లో పాత్రధారులు ఎక్కువగా ఉండేవారు. దాని వల్ల రకరకాల పాత్రలు చేసే అవకాశం ఆనాటి ఆర్టిస్టులకు దక్కింది. నేడు ఆ పరిస్థితి లేదు.
మీరు రంగస్థల నటులా?
అవును... స్కూల్ డేస్‌లోనే నాటకాలు వేశాను. కాలేజ్ టైమ్‌లో అయితే ఇక లెక్కే లేదు. అయితే పరిషత్‌లకు మాత్రం వెళ్లలేదు.
అసలు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు?
నేను భీమవరం ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రొఫెసర్ని. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జలవనరులపై పీహెచ్‌డీ చేశాను. తర్వాత మానసిక శాస్త్రంలో డిగ్రీ చేశాను.
ఉన్నత విద్యావంతులైన మీరు ఇలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడమేంటి?
నటనపై ఉన్న ప్రేమ. సినిమాపై ఉన్న మమకారం. అదే నన్ను ఇక్కడకు నడిపించింది. నా చదువునే నమ్ముకొని ఉన్నట్లయితే... మీరన్నట్లు ఇంకా మంచి పొజిషన్‌లో ఉండేవాణ్ణేమో! అయితే... ఇంత గుర్తింపు ఉండేది కాదు కదా!
అసలు బాపు-రమణల పరిచయం ఎలా ఏర్పడింది?
‘మిథునం’ రచయిత శ్రీరమణగారు నాకు పాతికేళ్లుగా మిత్రుడు. ఆయన్ను కలవడానికి భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు బాపుగారు ‘నవ్వితే నవ్వండి’ అనే హాస్య కార్యక్రమం చేస్తున్నారు. నన్ను చూడగానే వెంటనే అందులో అవకాశం ఇచ్చేశారు. తర్వాత శ్రీనాథ కవిసార్వభౌమ, మిస్టర్ పెళ్లాం, రాంబంటు... మీకు తెలిసిందే. మధ్యలో కొన్ని బాధ్యతల కారణంగా భీమవరం వెళ్లిపోయాను. కానీ సినిమాపై ఇష్టం మళ్లీ నన్ను హైదరాబాద్‌కి లాక్కొంచింది. ‘చిత్రం’ నుంచి నటునిగా కొనసాగుతున్నాను.
తెలుగులో కమెడియన్స్ ఎక్కువ కదా! పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా?
అలాంటిదేం లేదండీ.. ఇక్కడ ఎవరి పాత్రలు వారివే. స్థాయిని బట్టి కేరక్టర్లుంటాయి అంతే.
నటన కాక, దైవదత్తంగా మీకు అబ్బిందేంటి?
రచన.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నాను. సైకాలజీ నేపథ్యంలో సాగే ఈ కథ... పిల్లలు, తల్లిదండ్రులు, అధ్యాపకుల చుట్టూ తిరుగుతుంది. కేవలం అవార్డు కోసమే ఈ ఫిలిం తీయబోతున్నా. దీనికి దర్శకుణ్ణి కూడా నేనే. అలాగే... నేను మంచి వక్తని. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో హాస్యోపన్యాసం చేశాను.. చేస్తున్నాను. ‘హాస్యానందం’ అనే పత్రికలో ‘కొంటె ప్రశ్నలు-తుంటరి జవాబులు’ అనే శీర్షిక నాదే. రీడర్స్ అడిగే ప్రశ్నలకు నేను జవాబులిస్తుంటా. దానికి విపరీతమైన అప్లాజ్ వస్తోంది. అంతకు ముందు మల్లిక్ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే.. మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు నాకు.
పుస్తకాలు చదువుతారా?
విపరీతంగా... మల్లాది వెంకటకృష్ణమూర్తి, రావిశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, ముళ్లపూడి వెంకటరమణ, పొత్తూరి విజయలక్ష్మి... వీరందరూ నా అభిమాన రచయితలు. ఇంగ్లిష్ పొయిట్రీ కూడా చదువుతాను.
అసలు మీ గుండు కథ ఏంటి?
ఈ గుండు నేను గీచుకున్నది కాదు. పరిశ్రమ గీచింది. ఇక్కడ ఒక ముద్ర పడితే... ఇక అది కంటిన్యూ అయిపోవాలి. నేను జుత్తు పెంచినా సినిమా ఇండస్ట్రీ ఒప్పుకోవడం లేదు. దగ్గరుండి మరీ గుండు గీస్తోంది. ఎవరికైనా ఫోన్ చేసి ‘సార్... నేను సుదర్శన్‌ని’ అన్నాననుకోండీ... ‘ఎవరు... గుండు సుదర్శనా’ అని నా పేరును వారే ఖరారు చేసేస్తున్నారు. దాంతో నేను కూడా అలవాటు చేసేసుకున్నాను.