gundu sudarshan
-
అక్షర సందేశం
శివాజీ రాజా, జాకీ, గుండు సుదర్శన్, సీవీఎల్ నరసింహారావు, భావన ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్షరం’. జాకీ తోట దర్శకత్వంలో నటుడు లోహిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా భీమినేని ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి పతాకంపై ఈ నెల 26న విడుదలవుతోంది. లోహిత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందరికీ అన్నీ ఉచితంగా ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వాలు విద్యను మాత్రం అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాలను, మోయలేని బరువులు పిల్లల మీద రుద్దుతున్న తల్లిదండ్రులను ప్రశ్నించే చిత్రమిది. తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోవాలని పిల్లలకి తెలియజెప్పే చిత్రం కూడా. నేడు మనం చదువుకోవడం లేదు.. చదువు కొంటున్నాం. దాని వల్ల సహజమైన జ్ఞానం అనేది నశించింది’’ అన్నారు. -
త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తా
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): త్వరలోనే తాను ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తానని, ఇందుకు సంబంధించిన స్క్రిప్టు సిద్ధం చేసుకుంటున్నానని సినీ హాస్య నటుడు గుండు సుదర్శన్ తెలిపారు. సొంతపని మీద ఏలూరుకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 1992లో తాను శ్రీనాథకవి సార్వభౌమ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టానని, ఐతే మొదటి చిత్రంగా మిస్టర్ పెళ్లాం విడుదలైందని వెల్లడించారు. తాను దర్శకత్వం వహించబోయే చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉంటుందన్నారు. అలాగే తాను ప్రధానపాత్రగా ఒక చిత్రాన్ని త్వరలోనే చేయబోతున్నానని, దానికి సంబంధించిన దర్శకుడు, నిర్మాత తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. తాను నటించిన చిత్రం, అతడు, ఎలా చెప్పను, మల్లీశ్వరి చిత్రాల్లో పాత్రలు ప్రజాదరణ పొందాయన్నారు. దాదాపు 350 చిత్రాల్లో నటించినట్టు చెప్పారు. ప్రస్తుతం వస్తున్న హీరోలలో నాని, విజయ్ దేవరకొండ మంచి ట్యాలెంట్ కనిపిస్తోందన్నారు. తమన్నా డ్యాన్స్, అనుష్క నటన అంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు. అలాగే దర్శకుల్లో ఈవీవీ సత్యనారాయణ, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల తదితరులు తనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. పరిశమ్రలో ప్రతిభకన్నా అవకాశమే గొప్పదని, ఎంతటి ప్రతిభావంతుడైనా అవకాశాలు లేకపోతే చేయగలిగిందేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మహేష్ బాబు చిత్రంతో పాటు మరో 10 చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. -
లేపాక్షి ఆలయంలో గుండు సుదర్శన్
లేపాక్షి : లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని హాస్యనటుడు గుండు సుదర్శన్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్యనటుడిగా తనను ఆదరించిన అభిమానులకు ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు. -
నాటకాల్లోనే కష్టం..
సినీ హాస్య నటుడు గుండు సుదర్శన్ వీరవాసరం : సినీ రంగం కంటే నాటక రంగంలో నటనే కష్టమని ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు సుదర్శన్ తెలిపారు. వీరవాసరం కళా పరిషత్ నాటక పోటీల సభలకు విచ్చేసిన ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామం, నాన్నగారు సూరంపూడి సుబ్బారావు తణుకులో అడ్వకేట్‌గా పనిచేసేవారు. అమ్మ కనకలత. నేను కర్ణాటకలో ఎంటెక్ పూర్తి చేశా. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 1983 నుంచి 1998 వరకూ లెక్చరర్‌గా పనిచేసా. బాపు-రమణలు దూరదర్శనలో తీసిన సీరియల్ ‘నవ్వితే నవ్వండి’ ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించాను. చిన్నతనం నుంచి అనేక నాటకాల్లో నటించాను. ‘మొండి గురువు- బండ శిష్యుడు’ నాటకం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాను. 1992లో నందమూరి తారకరామారావు ప్రధాన పాత్ర పోషించిన కవి సార్వభౌమ శ్రీనాథుడు చిత్రంతో వెండితెర ప్రవేశం చేశాను. ఇప్పటి వరకూ సుమారు 365కు పైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించాను. మిస్టర్ పెళ్లాం, చిత్రం, చిరునవ్వుతో, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, రాంబాబు, కబడ్డీకబడ్డీ, అతడు, మనం సినిమాలు గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం వెంకటేశ్, సాయిధరమ్‌తేజ్, మోహన్‌లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. కామెడీ విలన్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే నా అశ అని ముగించారు. -
నేను జుత్తు పెంచితే సినీ పరిశ్రమ ఒప్పుకోవడం లేదు!
శ్రీరమణను కలవడానికి వచ్చిన సుదర్శన్‌కి బాపు-రమణలు పరిచయమవడమేంటి? అంతా విష్ణుమాయ. ఇంజినీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన సుదర్శన్.. సినిమాల్లో కామెడీ వేషాలు వేయడమేంటి? అంతా విష్ణుమాయ. సూరంపూడి సుదర్శన్ కాస్తా... గుండు సుదర్శన్‌గా మారిపోవడమేంటి? అంతా విష్ణుమాయ. ఇలాంటి విష్ణుమాయలు సుదర్శన్ జీవితంలో చాలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. చదవండి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి సార్? ఆగడు, పవర్, పండగచేస్కో, అల్లుడు శీను... ఇవిగాక ఓ చిన్నా చితకా కలిసి ఓ అరడజను సినిమాలుంటాయి. అంటే కెరీర్ మంచి స్పీడ్మీదున్నదనమాట? ఇంకా బాగుండాలి... ఉన్నదాంట్లోనే సంతృప్తి పడిపోతే మీరన్నట్లు బాగుందనే అనాల్సొస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు కదా! అంటే ఎలా ఉండాలంటారు? ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఇక్కడకొస్తామండీ... ఈ మాత్రం కీర్తితో సరిపెట్టుకోలేం కదా! గుండు సుదర్శన్ అంటే.. ఇంకా ‘మిస్టర్ పెళ్లాం’ సినిమా గురించే చెబుతున్నారు. ఇప్పటికి దాదాపు రెండొందల పై చిలుకు సినిమాలు చేశాను. కానీ ఏం లాభం... ఒక నటునిగా సంతృప్తినిచ్చే పాత్ర మాత్రం దక్కడం లేదు. పొరపాటు ఎక్కడ జరుగుతోందంటారు? టైమ్ అంతే.. నిజానికి ఇప్పుడు సినిమా రంగం మొత్తం కామెడీపైనే ఆధారపడి ఉంది. చివరకు స్టార్ హీరోలు సైతం కామెడీ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వారి కోసం రచయితలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కామెడీ రాస్తున్నారు. అయితే... అలాంటి మంచి సన్నివేశాల్లో మా లాంటి వారికి మాత్రం స్థానం ఉండటం లేదు. అదే బాధ. మేం కూడా బాగా నటించగలమండీ.. అంటే పరిశ్రమలో ప్రోత్సాహం లేదంటారా? అద్భుతమైన ప్రోత్సాహం ఉంది. అదే లేకపోతే రెండొందల సినిమాలు చేసుండేవాడినా? అయితే... ఇక్కడ స్టార్ స్టేటస్‌ని బట్టే పాత్రలు. నా లాంటి వారికి చిన్నా చితకా పాత్రలే దక్కుతాయి. నేనేంటో నిరూపించుకోవాలంటే అసలు అవకాశం రావాలి కదా. ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది? కామెడీనే కాదు, అన్ని రసాలూ పోషించగల సత్తా నాకుంది. కానీ పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని నాకు కామెడీ వేషాలే ఇస్తున్నారు. ఇదివరకు సినిమాల్లో పాత్రధారులు ఎక్కువగా ఉండేవారు. దాని వల్ల రకరకాల పాత్రలు చేసే అవకాశం ఆనాటి ఆర్టిస్టులకు దక్కింది. నేడు ఆ పరిస్థితి లేదు. మీరు రంగస్థల నటులా? అవును... స్కూల్ డేస్‌లోనే నాటకాలు వేశాను. కాలేజ్ టైమ్‌లో అయితే ఇక లెక్కే లేదు. అయితే పరిషత్‌లకు మాత్రం వెళ్లలేదు. అసలు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు? నేను భీమవరం ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రొఫెసర్ని. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జలవనరులపై పీహెచ్డీ చేశాను. తర్వాత మానసిక శాస్త్రంలో డిగ్రీ చేశాను. ఉన్నత విద్యావంతులైన మీరు ఇలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడమేంటి? నటనపై ఉన్న ప్రేమ. సినిమాపై ఉన్న మమకారం. అదే నన్ను ఇక్కడకు నడిపించింది. నా చదువునే నమ్ముకొని ఉన్నట్లయితే... మీరన్నట్లు ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాణ్ణేమో! అయితే... ఇంత గుర్తింపు ఉండేది కాదు కదా! అసలు బాపు-రమణల పరిచయం ఎలా ఏర్పడింది? ‘మిథునం’ రచయిత శ్రీరమణగారు నాకు పాతికేళ్లుగా మిత్రుడు. ఆయన్ను కలవడానికి భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు బాపుగారు ‘నవ్వితే నవ్వండి’ అనే హాస్య కార్యక్రమం చేస్తున్నారు. నన్ను చూడగానే వెంటనే అందులో అవకాశం ఇచ్చేశారు. తర్వాత శ్రీనాథ కవిసార్వభౌమ, మిస్టర్ పెళ్లాం, రాంబంటు... మీకు తెలిసిందే. మధ్యలో కొన్ని బాధ్యతల కారణంగా భీమవరం వెళ్లిపోయాను. కానీ సినిమాపై ఇష్టం మళ్లీ నన్ను హైదరాబాద్‌కి లాక్కొంచింది. ‘చిత్రం’ నుంచి నటునిగా కొనసాగుతున్నాను. తెలుగులో కమెడియన్స్ ఎక్కువ కదా! పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా? అలాంటిదేం లేదండీ.. ఇక్కడ ఎవరి పాత్రలు వారివే. స్థాయిని బట్టి కేరక్టర్లుంటాయి అంతే. నటన కాక, దైవదత్తంగా మీకు అబ్బిందేంటి? రచన.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నాను. సైకాలజీ నేపథ్యంలో సాగే ఈ కథ... పిల్లలు, తల్లిదండ్రులు, అధ్యాపకుల చుట్టూ తిరుగుతుంది. కేవలం అవార్డు కోసమే ఈ ఫిలిం తీయబోతున్నా. దీనికి దర్శకుణ్ణి కూడా నేనే. అలాగే... నేను మంచి వక్తని. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో హాస్యోపన్యాసం చేశాను.. చేస్తున్నాను. ‘హాస్యానందం’ అనే పత్రికలో ‘కొంటె ప్రశ్నలు-తుంటరి జవాబులు’ అనే శీర్షిక నాదే. రీడర్స్ అడిగే ప్రశ్నలకు నేను జవాబులిస్తుంటా. దానికి విపరీతమైన అప్లాజ్ వస్తోంది. అంతకు ముందు మల్లిక్ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే.. మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు నాకు. పుస్తకాలు చదువుతారా? విపరీతంగా... మల్లాది వెంకటకృష్ణమూర్తి, రావిశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, ముళ్లపూడి వెంకటరమణ, పొత్తూరి విజయలక్ష్మి... వీరందరూ నా అభిమాన రచయితలు. ఇంగ్లిష్ పొయిట్రీ కూడా చదువుతాను. అసలు మీ గుండు కథ ఏంటి? ఈ గుండు నేను గీచుకున్నది కాదు. పరిశ్రమ గీచింది. ఇక్కడ ఒక ముద్ర పడితే... ఇక అది కంటిన్యూ అయిపోవాలి. నేను జుత్తు పెంచినా సినిమా ఇండస్ట్రీ ఒప్పుకోవడం లేదు. దగ్గరుండి మరీ గుండు గీస్తోంది. ఎవరికైనా ఫోన్ చేసి ‘సార్... నేను సుదర్శన్‌ని’ అన్నాననుకోండీ... ‘ఎవరు... గుండు సుదర్శనా’ అని నా పేరును వారే ఖరారు చేసేస్తున్నారు. దాంతో నేను కూడా అలవాటు చేసేసుకున్నాను.