నాటకాల్లోనే కష్టం..
సినీ హాస్య నటుడు గుండు సుదర్శన్
వీరవాసరం : సినీ రంగం కంటే నాటక రంగంలో నటనే కష్టమని ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు సుదర్శన్ తెలిపారు. వీరవాసరం కళా పరిషత్ నాటక పోటీల సభలకు విచ్చేసిన ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామం, నాన్నగారు సూరంపూడి సుబ్బారావు తణుకులో అడ్వకేట్‌గా పనిచేసేవారు. అమ్మ కనకలత. నేను కర్ణాటకలో ఎంటెక్ పూర్తి చేశా. భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 1983 నుంచి 1998 వరకూ లెక్చరర్‌గా పనిచేసా. బాపు-రమణలు దూరదర్శనలో తీసిన సీరియల్ ‘నవ్వితే నవ్వండి’ ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించాను.
చిన్నతనం నుంచి అనేక నాటకాల్లో నటించాను. ‘మొండి గురువు- బండ శిష్యుడు’ నాటకం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాను. 1992లో నందమూరి తారకరామారావు ప్రధాన పాత్ర పోషించిన కవి సార్వభౌమ శ్రీనాథుడు చిత్రంతో వెండితెర ప్రవేశం చేశాను. ఇప్పటి వరకూ సుమారు 365కు పైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించాను. మిస్టర్ పెళ్లాం, చిత్రం, చిరునవ్వుతో, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, రాంబాబు, కబడ్డీకబడ్డీ, అతడు, మనం సినిమాలు గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం వెంకటేశ్, సాయిధరమ్‌తేజ్, మోహన్‌లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. కామెడీ విలన్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే నా అశ అని ముగించారు.