అవన్నీ ఉత్తిదే!
పాపారావ్ చౌదరి గారూ... బావున్నారా?
ఆ... బావున్నానండీ. నా అసలు పేరు పాపారావ్ చౌదరని చాలామందికి తెలీదు... మీరు బానే గుర్తెట్టుకున్నారే!
ఇప్పుడేం చేస్తున్నారు?
టీవీలో టెన్నిస్ వస్తుంటే చూస్తున్నా. ఒక్క పేకాట తప్ప ఏ ఆట అయినా చూస్తాను. క్రికెట్, ఫుట్‌బాల్, షటిల్ అన్నీ చూడటం ఇంట్రస్టే నాకు.
మేం అడిగింది సినిమాలేం చేస్తున్నారని?
నిన్నటి వరకూ గోపీచంద్ షూటింగ్‌కి వెళ్లొచ్చా. ‘రుద్రమదేవి’ సినిమాలో కూడా చేశాను!
ఈ మధ్య మీకు బాగా గ్యాప్ వచ్చినట్టుంది?
గ్యాప్‌లు వస్తుంటాయి. మళ్లీ ఫిల్ అవుతుంటాయి. ఇక్కడ ఇదంతా కామన్. నేను నటించిన చాలా చిన్న సినిమాలు విడుదల కాలేదు. కొన్ని విడుదలైనా ప్రేక్షకులు చూడలేదు. అందువల్లే ఎక్కువ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తోంది.
కొత్త కమెడియన్ల రాక మీకేమైనా ఎఫెక్టా?
ప్రతివాడూ ఏదో ఒక సమయంలో కొత్తే కదండీ. కొత్త నీరు అనేది ఎప్పటికప్పుడు వస్తేనే ఫ్రెష్ అనిపిస్తుంది. కామెడీక్కూడా అంతే. కొత్త కమెడియన్లు, కొత్త టైమింగ్స్... అంతా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అవకాశాలనే అందరూ పంచుకోవాలి. ఏదైనా ప్రాప్తం బట్టే మనకు దక్కుతుంది.
ఇంతకూ మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా ఓకే కదా?
అదేంటోనండీ... ఈ మధ్య అందరూ ఇదే అడుగుతున్నారు. అందరూ అలా అడుగుతుంటే నా మీద నాకే డౌట్ వస్తోంది. నాకు మెడ నరాల సమస్య తప్ప ఇంకేం రోగాలు లేవు. హెల్తీగా ఉన్నాను. నాకు ఆరోగ్యం బాగోలేదని, కేన్సర్ అని, ఏవేవో రూమర్లు వచ్చినట్టున్నాయి. అవన్నీ ఉత్తిదే.
సినిమాలకేవో కథలు రాస్తున్నారని తెలిసింది?
శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా మొదలు కానుంది. దానికి కథ, మాటలు రాశాను. ఇది కాక ఇంకో కథ రెడీగా ఉంది. అయినా నేనేం పెద్ద రైటర్‌ని కాదు. నువ్వు రాయగలవని మీలాంటోళ్లంతా అంటుంటే రాశానంతే. ఆ రెండు కథలూ ఎక్కువ చార్లీ చాప్లిన్ స్టయిల్‌లో రాశాను.
వంశీ గారి దర్శకత్వంలో హీరోగా చేస్తున్నారట?
అప్పుడెప్పుడో అనుకున్నారు. దాని కోసం గుండు కొట్టించుకోమన్నారు. అప్పుడు నేను చాలా బిజీగా ఉండి, కుదర్లేదు.
డెరైక్షన్ చేసే ఆలోచన ఉందా?
అవకాశాలొస్తున్నాయి. చేసినా చేయొచ్చు. అయినా నేనేదీ ప్లాన్ చేసుకోను. భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా వెళ్లిపోతా.
ఫైనల్‌గా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇంతకూ మీకిది ఎన్నో పుట్టిన రోజు?
నేనసలు బర్త్‌డేలు జరుపుకోను. అయినా మగవాళ్ల వయసు, ఆడవాళ్ల జీతం అడగకూడదండీ (అని నవ్వేశారు తనదైన శైలిలో).