
ఒకప్పుడు బుల్లి తెరపైకార్యక్రమాలు కేవలంస్టూడియోల్లో చిత్రీకరించి ప్రసారం చేసేవారు. ప్రస్తుతం అవి జనం మధ్యలోనే జరుగుతున్నాయి. చిన్నితెర వేల్పులను పల్లెలకు,వీక్షకుల ఇళ్లకు, ఊళ్లకు సైతం ప్రయాణం కట్టిస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో :పచ్చని పల్లెల్లో పండగ సంబరాలు మరీ ముఖ్యంగా సంక్రాంతి వేడుకలు సహజసిద్ధంగానే వచ్చేస్తాయి. కాంక్రీట్ జంగిల్స్‌లాంటి సిటీల్లో మాత్రం వాటిని మన నట్టింటికి తెచ్చేవి చిన్ని తెర చిద్విలాసాలే. నగరవాసులకు సంక్రాంతితో కనువిందు చేసేందుకు పండగ సందర్భంగా ఏర్పాటు చేసే టీవీ కార్యక్రమాలతో పల్లెల్లో ముందస్తు సంబరాలు వచ్చేస్తున్నాయి.
పల్లెలకే ఎందుకు?
మిగతా పండగల సంగతేమో గాని సంక్రాంతిని మాత్రం నగరంలో కళ్లకు కట్టడం అసాధ్యం. అందుకే చిన్నితెర వేల్పులు పల్లెల్ని ఎంచుకుంటున్నారు. సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేని సిటిజనులకు ఊరట ఇస్తూనే మరోవైపు తామేం కోల్పోతున్నామో కూడా స్పష్టంగా వివరిస్తున్నారు. తద్వారా వీక్షకుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా పల్లెలకు వెళ్లి సంక్రాంతి టీవీ బృందం మాటల్లో చెప్పాలంటే...ఈ ముందస్తు సంబరాలు తమకు డబుల్ థమాకా.
వ్యయ ప్రయాసలు తప్పవు..
గతంలో స్టూడియోలకు పరిమితమయ్యే సంబరాలను ఇప్పుడు అవుట్‌డోర్‌కి విస్తరించడంతో పండగ వేడుకలను మన కళ్లకు కట్టడానికి చిన్నితెర కార్యక్రమాల నిర్వాహకులు స్టార్స్‌కు వ్యయప్రయాసలు తప్పడం లేదు. తమ స్టూడియోకి జూనియర్ ఆర్టిస్టులను తీసుకువచ్చి చేసే సందడికి వీడ్కోలు పలికి తామే స్వయంగా పల్లెలకు పయనమవుతున్నారు. పల్లె ప్రజలతో కలిసి మెలిసి ఆడిపాడేస్తున్నారు. ‘ఈ ఏడాది జీ తెలుగు సంక్రాంతి సంబరాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కోరుమిళ్ల, రామచంద్రాపురం ఊళ్లకు వెళ్లాం. దాదాపు 70 మందితో కూడిన మా బృందం రెండు రోజుల పాటు అక్కడే ఉంది. సంప్రదాయ పండగ వేడుకలతో పాటు విభిన్న రకాల ఆటల పోటీలు కూడా నిర్వహించాం’ అని తెలిపారు ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు ప్రతినిధి.
ఫెస్టివల్.. డబుల్
ప్రతీసారి ఊరెళ్తా. ఈసారి కూడా ఫ్రెండ్స్‌తో కలిసి భీమవరం వెళుతున్నా. జీ తెలుగు కార్యక్రమంలో భాగంగా ముందే వేడుకల్లో పాల్గొనడంతో నాకు రెండు సార్లు పండగొచ్చినట్లయింది. సంక్రాంతి పండగకు అన్నింటి కన్నా నచ్చేది పిండి వంటలే. ఎందుకంటే వాటిని ప్యాక్ చేసుకుని మన ఊరికి తెచ్చుకుంటాం. అలా మరిన్ని రోజులు ఆ సంబరం మనతో ఉంటుంది. ముగ్గుల మధ్యలో కొలువుదీరే గొబ్బెమ్మల్ని చూడడం చాలా ఇష్టం. వాటిని డిస్ట్రబ్ చేయడం, వాటిని పేర్చిన అమ్మాయిల్ని ఆటపట్టించడం సరదా అనిపిస్తుంది. పల్లెకు వెళ్లకుండా సంక్రాంతిని ఎంజాయ్ చేయడం ఇంపాజిబుల్. ఎందుకంటే ఈ పండగకు అనుబంధంగా జరిగే ఎద్దుల పందేలు, కోడి పందేలు, కబడ్డీ, సైకిల్ రేస్ ఇలాంటివి ఏవీ ఇక్కడకు తేలేం కదా. ఏ రూపంలో నైనా ఈ సంప్రదాయ వైభవం ప్రస్తుత జనరేషన్‌కి తెలియాల్సిందే. మనం మన పిల్లలకి వాళ్లు వాళ్ల పిల్లలకు చెప్పుకుంటూ వెళ్లాలి. అప్పుడే భవిష్యత్తులోనూ సంప్రదాయ వారసత్వం నిలబడుతుంది. – సన్నీ అరుణ్, టీవీ నటుడు
అక్కడేఅసలైన పండగ..
ఎన్ని ఏర్పాట్లు చేసినా సిటీలో పండగ వాతావరణం ప్రతిఫలించలేం. అందుకే మా కార్యక్రమాల కోసం పల్లెలకు వెళ్లాం. మేం వైజాగ్‌లో ఉన్నప్పుడు ఈ ఫెస్టివల్‌ని బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ఏ ఇంటి ముందు చూసినా పండగ వాతావరణమే. భోగి ముందు రోజు బాగా కలర్స్ అవీ కలుపుకొని ఆ రోజు రాత్రిపూట వీధుల్లోనే ఒంటి గంట వరకూ ఉండడం, తెల్లవారుజామున నలుగు పెట్టుకుని స్నానాలు చేసి భోగి మంటలు వేసి దాని ముందు ఎంజాయ్ చేయడం, ఇల్లిల్లూ తిరిగి ఎవరి ముగ్గు బావుందంటూ చర్చించుకోవడం.. ఎంత బావుంటాయో.. అవన్నీ అందరికీ గుర్తు చేయాలనేదే మా ఆలోచన. సంప్రదాయాలంటే ఎన్నో తరాల నుంచి మనలో జీర్ణించుకుపోయిన, మన పూర్వీకులు మనకు ఇచ్చిన సంపద దీంతో సరిపోల్చేది ఏదీ లేదు. ప్రపంచం ఎంత మారిపోతున్నా పిల్లలు మన సంప్రదాయాల్ని మర్చిపోయేలా చేయకూడదు.
– సునంద, నటి
Comments
Please login to add a commentAdd a comment