ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ భార్య, ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం రచయితగా, కాలమిస్ట్‌గా ముందుకుసాగుతున్న ట్వింకిల్ సోషల్ మీడియాలో చురుకైన ఛలోక్తులు విసరడంలో దిట్టగా పేరు తెచ్చుకుంది. ఆమె చేసే వ్యంగ్య వ్యాఖ్యలు కొన్నిసార్లు ఆనందాన్ని పంచితే.. కొన్నిసార్లు వివాదాలు రేపాయి. తాజాగా 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకుడు, శ్రీశ్రీ రవిశంకర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది.
'శ్రీశ్రీవి ఉదాత్తమైన ఆలోచనలు. కానీ యోగా చేసేటప్పుడు ఆయన సగం గడ్డం నోటిలోకే వెళుతుంది. ఈ విషయంలో రాందేవ్ బాబా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్‌లో కామెంట్ చేసింది. దీనికి 'హోలీ మెన్ అండ్ హెయిరీ టేల్స్' (పవిత్ర పురుషుల వెంట్రుకల కథలు) అనే హ్యాష్‌ట్యాగ్ జోడించింది. ట్వింకిల్ ట్వీట్ రవిశంకర్ అభిమానుల్ని గాయపర్చింది. దురుద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు లక్షలాది మంది రవిశంకర్ అనుచరులను గాయపర్చాయని, కాబట్టి అక్షయ్ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3' తాము బహిష్కరిస్తారని హెచ్చరిస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ డైరెక్టర్ దర్శక్ హథీ ట్వీట్ చేశారు.
తన ట్వీట్‌పై వివాదం రేగడంతో ఆమె వెంటనే దానిని తొలగించారు. 'ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. అది కేవలం జోక్ మాత్రమే. పొరపాటు ఏదైనా జరిగితే నేను సరిదిద్దుకోగలను' అంటూ ట్వింకిల్ వివరణ ఇచ్చారు. అదే సమయంలో అక్షయ్ సినిమాను బహిష్కరిస్తామని దర్శక్ హథీ చేసిన బెదిరింపులపై ఆమె తీవ్రంగా స్పందించారు. 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయుడు ఆర్ట్ ఆఫ్ బెదిరింపులను అనుసరిస్తున్నారా? నేనే ఏమైనా అంటే నన్ను అడగండి. అంతేకానీ నా భర్తను లాగి.. సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరించడం సిగ్గుచేటు' అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతినడం వల్లే తాను అలా స్పందించానని, నా వ్యాఖ్యలు ఏమైనా మిమ్మల్ని బాధిస్తే క్షమించండని దర్శక్ హాథీ మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు.
శ్రీశ్రీ రవిశంకర్‌పై హీరో భార్య ట్వీట్‌తో రచ్చ!
Published Mon, May 9 2016 3:29 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM
Advertisement
Advertisement