నిర్మాతలతో ఆ ఒప్పందం కుదుర్చుకుంటా!
‘హీరోగా నటిస్తూనే నచ్చిన కామెడీ పాత్రలు చేయడానికి నేనేప్పుడూ రెడీ’ అని చాలా సందర్భాల్లో చెప్పాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు కామెడీ రోల్స్ చేయమని అవకాశాలు వచ్చాయి. అవి చేస్తే నేను హీరోగా చేసే సినిమాల నిర్మాతలకు సమస్య అవుతుందని అంగీకరించలేదు. ఇకపై నిర్మాతలు ఎవరైనా హీరోగా నటించమంటే, ఇతర సినిమాల్లో కామెడీ రోల్స్‌లో నటించేలా ఒప్పందం కుదుర్చుకుంటా’’ అన్నారు సునీల్. ఆయన హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్న సునీల్ చెప్పిన విశేషాలు.
► నేను వ్యక్తిగతంగా ఉంగరాలు, జాతకాలను నమ్ముతాను. అందుకని ఈ టైటిల్ పెట్టలేదు. కథకు యాప్ట్ అవుతుందనే ఫిక్స్ చేశాం. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి ఆనందం కలిగింది. కథను నమ్మినందుకు మంచి రిజల్ట్ వచ్చింది. అయినా అపజయం అనేది కథకు ఉంటుంది.. కథానాయకుడికి కాదు.
►నా కెరీర్‌లో ‘జక్కన్న’ కమర్షియల్‌గా పెద్ద హిట్ మూవీ. ఆ సినిమా తర్వాత ఆ రేంజ్‌లో డబ్బులు కలెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. నేను వ్యవసాయం చేశాను కాబట్టి రైతుల కష్టాలేంటో నాకు తెలుసు. అందుకే సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రైతు డైలాగ్ చెప్పగలిగాను.
►తెలుగులో హాస్యనటులు చలం, రాజబాబు, రాజేంద్రప్రసాద్, హిందీలో గోవింద, మొహమూద్ హీరోలుగానూ రాణించారు. వారి ప్రేరణతోనే హీరోనయ్యా.
∙
►చిరంజీవిగారి ‘సైరా నరసింహారెడ్డి’లో మంచి పాత్ర చేయబోతున్నాను. ఎన్. శంకర్ దర్శకత్వంలో చేసిన ‘టూ కంట్రీస్’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే తమిళ హిట్ ‘చతురంగ వేటై్ట’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నా.