డబ్బే ముఖ్యం కాదు
సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా క్రాంతిమాధవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో పిసినారి. డబ్బే సర్వస్వం అనుకునే వ్యక్తి.. మనిషికి డబ్బే ముఖ్యం కాదనుకునే స్థితికి ఎలా వచ్చాడన్నదే కథ. మనం అనుకునే స్వభావం మనలో తక్కువగా ఉంటుంది.
నేను అనుకునే స్థితిలో చాలా మంది ఉన్నారు. నేను నుంచి మనంగా మారడమే సినిమా. ‘ఓనమాలు’ చేశాక నేను వంద సినిమాలైతే చేయలేనని అర్థం అయ్యింది. పది సినిమాలైతే చేస్తాననే నమ్మకం ఉంది. ఆ పది సినిమాల్లో అన్ని జోనర్‌లలో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. నేను విద్యార్థిగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇష్టపడతాను.
నా సినిమాల గురించి మంచిగానో, చెడుగానో రాశారంటే అందులో నుంచి నేనూ కాస్త నేర్చుకోవాలి. సాధారణ జీవితంలో మనలో ప్రతి ఒక్కరికీ క్రియేటివ్‌గా ఆలోచించి ఓ కథ రాయడానికో, సినిమా తీయడానికో కావాల్సినంత సామర్థ్యం ఉంటుంది. రెగ్యులర్ సినిమాను చూపించాలనుకున్నప్పుడు అది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలనేదే నా ఆలోచన. సునీల్ ఈ చిత్రంలో రాంబాబు పాత్రలో ఒదిగిపోయారు’’ అని చెప్పారు. తదుపరి విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్.రామారావు నిర్మాణంలో ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నా అని క్రాంతిమాధవ్ అన్నారు.