
అక్షయ్ ఓటమి... జాక్వెలిన్ గెలుపు!
అది హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్-3’ షూటింగ్ స్పాట్. షాట్ ఓకే కాగానే హీరో అక్షయ్‌కుమార్ అక్కడ ఖాళీగా ఉన్న స్థలంలో రెండు ఫుట్‌బాల్స్ ఉంచారు. కిందకి వొంగి, ఒక ఫుట్ బాల్‌ను ఓ చేత్తో అదిమి పట్టుకుని, దాని చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. 1...2...3... ఇలా 13 సార్లు తిరిగి, దానికి దగ్గరగా ఉన్న మరో ఫుట్‌బాల్‌ను గోల్‌పోస్ట్‌లోకి కొట్టారు. కానీ బ్యాడ్‌లక్. గోల్ చేయలేకపోయారు. ఇదేం ఆట? అక్షయ్‌కుమార్ ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా? ‘డిజీ గోల్స్’ అనే చాలెంజ్‌లో భాగంగా ఆయన ఇలా చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సవాల్ హవా జోరుగా సాగుతోంది.
‘ఐస్ బకెట్ చాలెంజ్’ తరహాలో సాగే పోటీయే ‘డిజీ గోల్స్’ చాలెంజ్. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి అందులో సక్సెస్ అయ్యారు. మన దేశం నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మొట్టమొదటి సెలబ్రిటీగా అక్షయ్‌కుమార్ ఖ్యాతికెక్కారు. ఈ సవాల్‌లో అక్షయ్ ఓడారు కానీ, ఆయన సరసన నటిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం గెలిచారు. పేదరికం, అసమానత్వం, వాతావరణ మార్పుల మీద అవగాహన కల్పించడానికి ఈ డిజీ గోల్స్ చాలెంజ్‌ను ప్రవేశపెట్టారు. మరి.. ఈ సినిమా తారల్లో ఈ చాలెంజ్‌ను ఎవరెవరు స్వీకరిస్తారు? ఎవరు గెలుస్తారు? అనేది చూడాలి.