అంజలి లేకపోతే ఈ సినిమా లేదు
‘‘ఇప్పటికి 45 కథలు రాసిన నాకు రాజకిరణ్ చెప్పిన ఈ కథ విని నేనెందుకిలా ఆలోచించలేకపోయానా అనిపించింది. భారీ చిత్రాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న నేను ఇలాంటి కథలను మరచిపోతున్నానేమో అనిపించింది. అంజలి ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసేవాళ్లమే కాదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆయన సమర్పణలో, అంజలి ప్రధాన పాత్రలో రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. వీవీ వినాయక్, గోపీచంద్, మంచు లక్ష్మి పాటల సీడీలను ఆవిష్కరించి, ఎమ్మెల్యే కోన రఘుపతికి అందించారు.
వినాయక్ మాట్లాడుతూ -‘‘అసలు దెయ్యాలే లేవనే నమ్మే బ్రహ్మానందంగారికి దెయ్యం కనిపిస్తే పరిస్థితి ఏమిటనేది ఈ సినిమా కాన్సెప్ట్’’ అన్నారు. హీరో సునీల్ మాట్లాడుతూ -‘‘మామూలు సినిమాల్లో బ్రహ్మనందం భయపడితే వంద రోజులు ఆడుతున్నాయి. అదే హారర్ సినిమాలో బ్రహ్మానందంగారు భయపడితే తప్పకుండా 150 రోజులు ఆడుతుంది’’ అని చెప్పారు. ఇది తనకు స్పెషల్ మూవీ అని అంజలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్, పోనీ వర్మ, దశరథ్, శ్రీవాస్, ‘దిల్’ రాజు, బెల్లంకొండ సురేశ్, వీరు పోట్ల, మెహర్ రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్ లక్కరాజు, శ్రీజో, మోనాల్ గజ్జర్, నీరజ కోన తదితరులు మాట్లాడారు.