
నా ప్రేమ, పెళ్లి సినిమాతోనే
ప్రస్తుతానికి నేను ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా సినిమానే అన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విదేశాల్లో చదివి వచ్చిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. తను మంచి డాన్సర్. ముఖ్యంగా బెల్లీ డాన్స్‌లో ప్రావీణ్యం పొందారు. కథానాయకిగా పోడాపోడీ చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత విశాల్‌తో కలిసి మదగజరాజా చిత్రంలో నటించారు. ఆ చిత్రం పూర్తి అయినా ఆర్థికపరమైన కారణాలతో ఇంకా విడుదల కాలేదు.ఆ మధ్య బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో నటిస్తున్నారు.
ఈ బ్యూటీకీ నటుడు విశాల్‌కీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలా కాలంగా వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.ఈ వ్యవహారం గురించి వరలక్ష్మి తనకు బాల్యం నుంచి స్నేహితురాలు అని నటుడు విశాల్ స్పందించారు గానీ, నటి వరలక్ష్మి మాత్రం నోరు మెదపకుండా సెలైంట్‌గా అంతా గమనిస్తూ వచ్చారు. అయితే ఇటీవల నటుడు విశాల్ తన పెళ్లి 2018 జనవరిలో జరగుతుందని,అందుకు కొత్తగా నిర్మించనున్న నడిగర్‌సంఘంలోని హాలు వేదిక కానుందని వెల్లడించారు. అంతే కాదు లక్ష్మీకరమైన అమ్మాయే తన జీవిత భాగస్వామి అవుతుందని పేర్కొని మీడియాకు మరింత మేత వేశారు.దీంతో విశాల్, వరలక్ష్మిల వివాహం ఖాయం అనే ప్రచారం జోరందుకుంది.
అలాంటిది ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా కాస్త ఘాటుగానే స్పందించారు. తన ప్రేమ,పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని అన్నారు. కాబట్టి ఈ విషయం గురించి ఇప్పటికే చాలా ఎక్కువగా ప్రచారం చేశారని అన్నారు. ఇకపై సామాజిక మాద్యమాలు రాద్దాంతం చేయవద్దని, తనకు ప్రస్తుతానికి ప్రేమ,పెళ్లి అన్నీ సినిమానేని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఇంత ఆలస్యంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇంత ఘాటుగా స్పందించడానికి కారణాలేమైఉంటాయబ్బా అని కోలీవుడ్ వర్గాలు ఆరా తీసే పనిలో పడ్డారు.