
కెమెరా వెనుక వరం
సినిమా అనే వర్ణ ప్రపంచంలో నటి వరలక్ష్మి తనను మరో కోణంలో ఆవిష్కరించుకోవాలని ఆశ పడుతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. ఏ రంగంలో అయినా తమ పని తాము చేసుకుపోయే వారు ఒక రకమైతే, ఇంకో రకం వారూ ఉంటారు. వారు తమ పనితోపాటు చుట్టు పక్కల వారి పనులను కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఆసక్తి ఉంటే అసిస్టెంట్ చేస్తుంటారు కూడా. వరలక్ష్మిని ఈ రకానికి చెందిన నటిగా భావించవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వరలక్ష్మి నాట్యంలో శిక్షణ పొందారు. అదనంగా సల్సా డాన్స్‌లోనూ ప్రావీణ్యం పొందారు. పోడాపోడీ చిత్రం ద్వారా నాయకిగా రంగ ప్రవేశం చేశారు.
ప్రస్తుతం జాతీయ ఉత్తమ దర్శకుడు బాలా దర్శకత్వం వహిస్తున్న తారా తప్పట్టై చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె గరకాటకారిణిగా నృత్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఈమె నటనకు జాతీయ అవార్డు వరించడం ఖాయం అంటున్నాయి చిత్ర వర్గాలు. శశికుమార్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటిం గ్ ఇటీవల పూర్తి కావడంతో నటుడు శశికుమార్‌తో సహా యూనిట్ అంతా ఇతర చిత్రాలపై దృష్టి సారించారు. అయితే నటి వరలక్ష్మి మాత్రం చిత్ర డబ్బింగ్ తదితర కార్యక్రమాల్లో దర్శకుడు బాలాకు సహాయకురాలిగా పని చేయడం విశేషం. షూటింగ్ సమయంలోనే సహాయ దర్శకురాలు బాధ్యతల్ని నిర్వహించి యూనిట్ వర్గాలతో మర్యాదగా ప్రవర్తించి వారి అభిమానాన్ని చూరగొన్నారు వరలక్ష్మి. అంతేకాకుండా దర్శకుడు బాలా ప్రశంసలు కూడా అందుకుంది. ఆయన నుంచి భవిష్యత్‌తో మంచి దర్శకురాలు అవుతాననే ఆశీస్సులు పొందారట. ఏమో గుర్రం ఎగురావచ్చు అన్న చందాన నటి వరలక్ష్మి మెగాఫోన్ పట్టే అవకాశాలు లేకపోలేదని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.