వెంకీ అట్లూరి, వరుణ్ తేజ్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, రాశీఖన్నా
‘‘భీమవరం ఊర్లో ఏముందో తెలియదు కానీ ఇక్కడి నుంచి త్రివిక్రమ్, సునీల్ వంటివారు.. పక్కనున్న పాలకొల్లు నుంచి చిరంజీవిగారు, కృష్ణంరాజుగారు, ప్రభాస్ వంటి ఎందరో తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చారు. ఇక్కడి నీటిలోనే ఏదో ఉంది. సినిమాకు కావాల్సిన కళ ఇక్కడ ఉంది. అదే మిమ్మల్ని, మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చింది’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ ఈ నెల 10న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా భీమవరంలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘1998లో వచ్చిన ‘తొలిప్రేమ’కు, 2018లో రానున్న ‘తొలిప్రేమ’కు నేనే డిస్ట్రిబ్యూటర్‌ని. ఆ ‘తొలిప్రేమ’ లా ఈ చిత్రం కూడా 100 శాతం యూత్‌దే. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. ‘ఫిదా’ తర్వాత ఈ సినిమా రావడం వరుణ్‌కి ప్లస్ అవుతుంది’’ అన్నారు. ‘‘తొలిప్రేమ’ టైటిల్ పెట్టినప్పుడు కాస్త భయపడ్డాం. వరుణ్ ఏమో ‘పర్వాలేదు కదా’ అన్నాడు. ఆ సినిమాతో పోలిక పెట్టను కానీ.. దాని గౌరవాన్ని కాపాడతాను’’ అన్నారు వెంకీ అట్లూరి.
‘‘చిరంజీవితో సినిమా తీయాలని 33ఏళ్ల కిందట తణుకు నుండి మద్రాస్ వెళ్లాను. బన్నీతో ‘ఆర్య 2’, రామ్‌చరణ్‌తో ‘మగధీర’, పవన్‌కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ తీశా. వరుణ్‌తో తీసిన ‘తొలిప్రేమ’ గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్‌ఎన్ ప్రసాద్. ‘‘వెంకీకి తొలి చిత్రమే అయినా బాగా తీశాడు. భవిష్యత్‌లో పెద్ద దర్శకుడవుతాడు.
ఈ సినిమాను అందరి కంటే ఎక్కువగా నమ్మింది ‘దిల్’రాజుగారే. బాపినీడు, ప్రసాద్‌గారు అద్భుతంగా నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ జార్జ్ విలియమ్స్ ప్రతి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. కథకు తగ్గ టైటిల్ అనిపించే ‘తొలిప్రేమ’ పెట్టాం. బాబాయ్ టైటిల్‌ని పాడు చేసేలా ఉండదు ఈ సినిమా’’ అన్నారు వరుణ్ తేజ్. ఎమ్మెల్యే రాధాకృష్ణ, రాశీఖన్నా, నటుడు ‘హైపర్’ ఆది, ఎస్.ఆర్.కె.ఆర్.కాలేజ్ ప్రిన్సిపాల్ పార్థసారథి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment