ప్రేమ.. ద్వేషం... ఓ ప్రేమకథ
‘‘సంవత్సరం ముందే శేఖర్ కమ్ముల నాకీ లైన్ చెప్పారు. స్క్రిప్ట్ రెడీ అయ్యాక చదివాను. చాలా నచ్చింది. ‘కంచె’ సినిమాలో వరుణ్‌తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ సినిమాకు వరుణ్ తేజ్‌ను హీరోగా తీసుకుందామని శేఖర్ చెప్పారు. సాయి పల్లవి నటించిన మలయాళ ‘ప్రేమమ్’ సూపర్ హిట్. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జోడి ఈ సినిమా 50 శాతం సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘ఫిదా’ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ప్రారంభమైంది.
‘లవ్- హేట్- లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రవిశేషాలను ‘దిల్’ రాజు చెబుతూ - ‘‘తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయితో అమెరికా అబ్బాయి ప్రేమలో పడతాడు. కథానాయిక తెలంగాణాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి కావడంతో ఆ రాష్ట్రంలోని బాన్సువాడను ఎంపిక చేశాం. బాన్సువాడాలో 45 రోజులు, అమెరికాలో మరో 45 రోజులు షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. నటుడు నాగేంద్రబాబు, చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సాయి పల్లవి తదితరులు పాల్గొన్నారు.