అద్భుతం అనే పదం ఈ సినిమాకు కరెక్ట్‌ | Varun Tej Speech At Anthariksham Trailer Launch | Sakshi
Sakshi News home page

అద్భుతం అనే పదం ఈ సినిమాకు కరెక్ట్‌

Published Mon, Dec 10 2018 5:44 AM | Last Updated on Mon, Dec 10 2018 5:44 AM

Varun Tej Speech At Anthariksham Trailer Launch - Sakshi

రాజీవ్‌ రెడ్డి, క్రిష్, సుకుమార్, లావణ్య, అదితీ, అల్లు అరవింద్, వరుణ్, సంకల్ప్‌

‘‘క్రిష్, రాజీవ్‌ అద్భుతాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ‘ప్రయత్నించి విఫలం అయినా ఫర్వాలేదు. ప్రయత్నించకుండా ఉండకూడదు’ అని ట్రైలర్‌లో ఉన్న డైలాగ్‌ చాలా బాగా నచ్చింది. కొత్త ఆలోచనలు, సాంకేతికంగా కొత్త సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. వరుణ్‌తేజ్, అదితీరావ్, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం’.

ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దర్శకుడు క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘మా కుటుంబంలో వరుణ్‌ తేజ్‌ డైమండ్‌.  వరుసగా సినిమాలు చేసేయాలి, డబ్బు సంపాదించాలి అనుకోకుండా ఆగి.. ఆలోచించి మంచి సినిమాలు చేస్తున్నాడు. ‘సమ్మోహనం’లో అదితీ నటనను చాలా ఎంజాయ్‌ చేశాను’’ అన్నారు. ‘‘అద్భుతం అనే పదం చాలా తక్కువసార్లు నప్పుతుంది.

ఈ సినిమాకు ఆ పదం సరిగ్గా సరిపోతుంది. సంకల్ప్‌ ఫస్ట్‌ సినిమాతో నీళ్లలోకి వెళ్లిపోయాడు. నెక్ట్‌ ఏంటా? అనుకున్నాను. అంతరిక్షానికి వెళ్లిపోయాడు. వరుణ్‌ ట్రై చేస్తే అంతరిక్షం అందుతుంది (వరుణ్‌ ఎత్తుని ఉద్దేశిస్తూ). సంకల్ప్‌ క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం వేసింది. క్రిష్, నేను, సంకల్ప్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేస్తాం (నవ్వుతూ).  సంకల్ప్‌.. ‘బాహుబలి’ లాంటి సినిమాలు కూడా చేయాలి. చేయగలడు. ‘వరుణ్‌ స్క్రిప్ట్‌ని ఎంచుకునే తీరు బావుంటుంది’ అని రామ్‌చరణ్‌ నాతో అన్నాడు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు సుకుమార్‌.

‘‘దర్శకులు ఎన్ని కథలైనా రాసుకోవచ్చు. కానీ హీరో ఓకే అన్నాకే సినిమా మొదలవుతుంది. కథను నమ్మిన వరుణ్‌కు థ్యాంక్స్‌. ఈ విజయంలో అగ్రతాంబూలం అతనికే ఇస్తాను. ఇలాంటి సినిమాతో నేనూ అసోసియేట్‌ అవ్వడం గర్వంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఈ సినిమా కూడా ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు క్రిష్‌.  ‘‘సినిమా చాలా కష్టపడి చేశాం. చాలా నమ్మకంగా కూడా ఉన్నాం. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు  వరుణ్‌ తేజ్‌.

‘‘ఇలాంటి పాత్‌ బ్రేకింగ్‌ సినిమాలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు లావణ్య. ‘‘రెండో సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్‌’’ అన్నారు అదితీరావ్‌. ‘‘ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ‘ఘాజీ’ కంటే రెండింతల నమ్మకంగా ఉన్నాను. ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతికి లోనవుతారని నమ్ముతున్నాను. ’’ అన్నారు దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో సత్యదేవ్, రాజా, కిట్టు విస్సాప్రగడ, ఆర్ట్‌ డైరెక్టర్‌ మోనికా, రామకృష్ణ, సహ నిర్మాత బిబో శ్రీనివాస్‌  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement