గ్రాండ్ ఓల్డ్ లేడి ఆఫ్ బాలీవుడ్ ఇకలేరు!
భారతీయ సినిమా, నాటక రంగానికికు సుదీర్ఘకాలంగా సేవలందించిన ప్రముఖ బాలీవుడ్ నటి జోహ్రా సెహగల్ గురువారం రాత్రి కన్నుమూశారు. అమె వయస్సు 102 సంవత్సరాలు. గురువారం మధ్యాహ్నం గుండె పోటు రావడంతో ఆమెను న్యూఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. మ్యాక్స్ ఆస్పత్రిలోనే జోహ్రా సెహగల్ తుది శ్వాసను విడిచారు. గత నాలుగురోజుల నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని జోహ్రా కూతురు కిరణ్ మీడియాకు వెల్లడించారు. జోహ్రా అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు లోధి రోడ్ లోని శ్మశాన వాటికలో జరుగుతాయని తెలిపారు.
ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ ట్విట్ చేయడం ద్వారా జోహ్రా మరణవార్త తెలిసింది. జోహ్రా మరణం తీవ్ర విషాదం నింపింది. ఆమె పూర్తిస్థాయి జీవితాన్ని ఆస్వాదించారు అని మరో ట్విట్ లో వెల్లడించారు. జోహ్రా మృతి భారతీయ సంస్కృతికి తీరని లోటని అన్నారు. 1935లో ఉదయ శంకర్ తో కలసి నర్తకిగా సినీ జీవితాన్ని ఆరంభించారు. భారతీయ సినిమాతోపాటు, పలు ఆంగ్ల చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లో దిల్ సే, కభీ కుషీ కభీ ఘమ్, హమ్ దిల్ దే చుకే సనమ్, బెండ్ ఇట్ లైక్ బెక్ హమ్, వీర్ జారా, చీనీ కమ్, సావరియా, చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో నటించారు.
గ్రాండ్ ఓల్డ్ లేడి ఆఫ్ బాలీవుడ్ గా జోహ్రాకు పేరుంది. పద్మశ్రీ, పద్మ విభూషణ్ తోపాటు కాళిదాస్ సమ్మాన్ లాంటి అవార్డులను అందుకున్నారు. 102 సంవత్సరాలపాటు జీవించినా.. సినీ ప్రేక్షకుల హృదయంలో చిరకాలం నిలిచిపోతారు. జోహ్రా మృతికి అమితాబ్ తోపాటు పలువురు ప్రముఖు సంతాపం తెలిపారు.