నాగిరెడ్డి తపాలా బిళ్లను ఆవిష్కరిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బన్వరిలాల్
భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి 105వ వర్ధ్దంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బన్వరిలాల్ చెన్నైలో ఆవిష్కరించారు.
తమిళసినిమా: నాగిరెడ్డి సేవలు అజరామరం అని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మేలు చేసే చిత్రాలు రూపొందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ సినీ పితామహుడు, దివంగత ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత, వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను శుక్రవారం చెన్నైలో ఆవిష్కరించారు. భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి విజయా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో ఎన్నో అద్భుత కళాఖండాలను నిర్మించారు.
పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి ఆ పాత మధుర చిత్రాలతో పాటు నమ్‌నాడు, ఎంగవీట్టు పిళ్లైవంటి పలు జనరంజక తమిళ చిత్రాల నిర్మించారు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వాహినీ స్టూడియో నిర్మాణ కర్త బి.నాగిరెడ్డినే. విజయా వైద్య, విద్యా సంస్థల వ్యవస్థాపకుడు అయిన నాగిరెడ్డికి ఈ నెల 25న 105వ వర్ధంతి రోజు. ఈ రోజును పురçస్కరించుకుని ఆయన పేరుతో తపాలాబిళ్లను విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోíహిత్ హాజరయ్యారు.
బి.నాగిరెడ్డి రూ.5 తపాలాబిళ్లను వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ బి.నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ బి.నాగిరెడ్డి అన్నా, ఆయన చిత్రాలన్నా తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలనే నాగిరెడ్డి రూపొందించారని కీర్తించారు. ఆయన చిత్రాల్లో భాషకు, యాసకు ప్రాముఖ్యత ఉండేదన్నారు.
శృంగారం లాంటి అసభ్య దృశ్యాలు లేకుండానే నాగిరెడ్డి ఎన్నో గొప్పగొప్ప ప్రేక్షకాదరణ పొందిన మంచి సందేశాత్మక కథా చిత్రాలను నిర్మించారని, ఇప్పుడు శృంగారం పేరుతో అపహాస్యం చేస్తున్నారని అన్నారు.
నిజానికి ఇప్పటి చిత్రాల్లో శృంగారం కంటే, అంగారమే కనిపిస్తుందని అన్నారు. అలా కాకుండా సమాజానికి మంచి చేసే కథా చిత్రాలతో భావితరానికి మంచి సందేశాన్ని అందించే బాధ్యత నేటి దర్శక నిర్మాతలపై ఉందన్నారు. నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృంతి, సంప్రదాయాలను పెంపొందించే చిత్రాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
భాష ఏదైనా మనందరం భారతీయులమని వ్యాఖ్యానించారు. మాతృభాష తల్లిపాలు లాంటిదని, ఇతర భాషలు అద్దం లాంటివని పేర్కొన్నారు. అలాంటి తెలుగు భాషను మనమే చెడగొట్టుకుంటున్నామని అన్నారు. ఎన్ని గూగుల్స్ వచ్చినా మన గూగుల్ (ఉపాధ్యాయులు)లను మరవరాదని అన్నారు. నాగిరెడ్డి సినిమాలతోనే కాకుండా రియల్ లెజెండ్ అని వ్యాఖ్యానించారు, ఆయన సేవలు అజరామరం అని, సినీమారంగానికే కాకుండా వైద్య, విద్యారంగాల్లోనూ ఉత్తమ సేవలను అందించిన గొప్ప మానవతావాది ఆయన అని అన్నారు.
ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగిరెడ్డి ఎంతో సాధించారని పేర్కొన్నారు. అందుకే ఆయన దాదా సాహెబ్ పాల్కే అవార్డులాంటి ఎన్నో గొప్పగొప్ప అవార్డులతో సత్కరింపబడ్డారని గుర్తు చేశారు.నాగిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఈ తరం దర్శక నిర్మాతలు చిత్రాలు చేయాలని హితవు పలికారు. నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను విడుదల చేసిన తపాలా శాఖకు, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ తపాలాబిళ్లను తన చేతులమీదగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. స్వశక్తితో ఎదిగి ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి నాగిరెడ్డి అని శ్లాఘించారు. చందమామ హిందీ పత్రికను తాను చిన్నతనంలోనే చదివాననని, అయితే ఆ పత్రిక సంపాదకుడు బి.నాగిరెడ్డి అన్న విషయం ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి తనయుడు బి.వెంకటరామిరెడ్డి, ఆయన సతీమణి బి.భారతీదేవి, రాష్ట్ర మంత్రి అన్భళగన్, ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎం.శరవణన్ వేదికనలంకరించారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.నాగిరెడ్డి మనువడు వినయరెడ్డి వందన సమర్పణ చేశారు.
నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు
Comments
Please login to add a commentAdd a comment