సినిమా సాహెబ్‌లు
భారతీయ చలన చిత్రసీమలో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి. నాగిరెడ్డి), అక్కినేని లక్ష్మీ వరప్రసాద రావు (ఎల్వీ ప్రసాద్)లది చెరిగిపోని చరిత్ర. ‘పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్’ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన ఘనత నాగిరెడ్డిది. చక్రపాణితో కలసి నాగిరెడ్డి తీసిన ‘షావుకారు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు’ వంటి పలు చిత్రాలతో పాటు ఇతర బేనర్లలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ఘనత ఎల్వీ ప్రసాద్‌ది.
‘రామ్ ఔర్ శ్యామ్, ప్రేమ్‌నగర్, స్వర్గ్ నరక్’ వంటి పలు హిందీ చిత్రాలకు బి. నాగిరెడ్డి సమర్పకుడు. ‘శారద, షాదీ కే బాద్, బిదాయి’ వంటి పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ‘ససురాల్, ఏక్ దూజే కేలియే’ వంటి చిత్రాలను నిర్మించారు ఎల్వీ ప్రసాద్. సమాజానికి ఉపయోగపడే చిత్రాలు అందించిన ఇద్దరూ వైద్య రంగంలోనూ సక్సెస్ఫుల్. నాగిరెడ్డి ‘విజయా హాస్పిటల్స్’ ద్వారా మెరుగైన వైద్యం అందేలా చేస్తే, ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’ ద్వారా నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేశారు ఎల్వీ ప్రసాద్.
తొలి ఇండియన్ టాకీ ‘ఆలమ్ ఆరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ తదితర చిత్రాల్లో నటుడిగానూ చేశారు ఎల్వీ ప్రసాద్. చెప్పుకుంటూ పోతే ఇద్దరి గురించి చాలా ఉంది. రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రస్తుత తరానికి ఇద్దరి జీవితం ఆదర్శం. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా బి. నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డి, ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేశ్ ప్రసాద్ పలు విశేషాలు పంచుకున్నారు.
ఆ లక్షణాలు నాన్నగారి ఎదుగుదలకు కారణం – రమేశ్ ప్రసాద్
(తండ్రి ఎల్వీ ప్రసాద్, తనయుడు సాయిప్రసాద్‌తో రమేశ్ ప్రసాద్ )
మా నాన్నగారు గొప్ప పేరు, ప్రఖ్యాతులు సంపాదించడానికి కారణం నాలుగు విషయాలు. ప్యాషన్ (అభిరుచి), పేషెన్స్ (సహనం), పెర్సివరెన్స్ (పట్టుదల), ప్యూరిటీ ఇన్ థాట్స్ (ఆలోచనల్లో నిజాయితీ). జీవితంలో ఈ నాలుగూ పాటించారాయన. నాన్నగారి లక్షణాలు మాకూ వచ్చాయి. ఆయన వెరీ సింపుల్ మేన్. విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి. ఆయనెప్పుడూ స్కూల్‌కి వెళ్లలేదు. నాన్నగారు పుట్టింది ఏలూరులోని సోమవరప్పాడులో. పెదవేగి వెళ్లి డ్రామాలు వేస్తుండేవారు. యాక్టింగ్ అంటే ఆయనకు ఇష్టం.
మా తాతగారు పెద్ద భూస్వామి. సుమారు 100 ఎకరాల భూమి కలిగిన వ్యక్తి. ఆయనకెంతో పలుకుబడి ఉండేది. అప్పట్లో సిల్క్ వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఆంధ్రా వాతావరణం సిల్క్ వ్యాపారానికి అంతగా సహకరించలేదు. విపరీతమైన లాస్ వచ్చింది. దాంట్లో నుంచి బయటపడటానికి వేరు శెనగ వేశారు. అప్పట్లో ఎవరైనా ఏదైనా పంట వేస్తున్నారంటే అందరూ అదే వేసేసేవాళ్లు. దాంతో శెనగ రేట్ పడిపోయింది. బస్తా 25పైసలు కూడా పలకలేదు.
అప్పులు తిరిగి కట్టలేని పరిస్థితి. అది నాన్నగారికి అవమానంగా అని పించింది. మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారు. దాంతో ఎవ్వరికీ చెప్పకుండా డిసెంబర్ 31 రాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అప్పులు తిరిగి కట్టలేకపోయామనే అవమానంతో నాన్నగారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అందరూ అనుకున్నారట. అప్పటికే నాన్నగారికి పెళ్లయింది. ఒక పాప కూడా. నేనింకా పుట్టలేదు. 16 నెలల తర్వాత ‘నేను క్షేమం. సినిమా కోసం బొంబాయి వచ్చాను. తిరిగొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను’ అని అమ్మకు ఉత్తరం రాశారట.
టైలర్ షాప్ క్లీనర్‌గా...
బొంబాయిలో నడియాడ్వాలా స్టూడియోస్, ఇంకా వేరే స్టూడియోస్ బయట తిరిగేవారట. సెక్యూరిటీ వాళ్లు ఆయన్ను లోపలికి పోనివ్వలేదు. అయితే బయట ఉన్న జింక్ షీట్స్ దగ్గర నిలబడి, లోపల జరిగేదంతా గమనించేవారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అలా చూస్తూ, రాత్రి అక్కడే ఫుట్‌పాత్ మీద నిద్రపోయేవారు. అక్కడి టైలర్‌షాప్ ఓనర్ నాన్నని గమనించి, ‘ఎందుకు రోజంతా ఇక్కడే ఉంటున్నావు’? అని అడిగారు.
అతనితో మాట్లాడాలంటే నాన్నగారికి హిందీ, ఇంగ్లీష్ రావు. సైగలతోనే విషయం చెప్పారు. టైలర్‌షాప్ ఓనర్ జాలిపడి నాన్నగారిని తన షాప్‌లో పనికి కుదుర్చుకున్నారు. ఉదయం ఓనర్ వచ్చేసరికి ఆ షాప్ క్లీన్ చేసి, హుక్కా అరేంజ్ చేసిపెట్టాలి. ఉండటానికి చోటే లేని సమయంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. నాన్నలో ఉన్న గొప్ప లక్షణం అది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ని నమ్ముతారు.
‘మా నాన్న 100 ఎకరాల భూస్వామి, నేను చీపురు పట్టుకోవడం ఏంటీ’ అనుకోలేదు. ఆ పనిని చాలా శ్రద్ధగా చేశారు. ఆ టైలర్ షాప్‌లో కొంతమంది యాక్టర్లు బట్టలు కుట్టించుకునేవారు. ఆ ఓనర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఆఫీస్ బాయ్‌గా నాన్నని చేర్పించారు. అక్కడి నుంచి నాన్నగారు సెల్ఫ్ టీచింగ్ (అన్నీ స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు). అలా ఆఫీస్‌బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా ఎదిగారు.
సరిగ్గా గాలి కూడా లేని ఇంట్లో...
అన్నయ్య, నేను బొంబాయిలోనే పుట్టాం. అన్నయ్య పుట్టినప్పుడు ఉన్న ఇంట్లో గాలి, వెలుతురు సరిగ్గా ఉండేవి కావట. దాంతో బాగా ఏడ్చేవాడట. అప్పుడు నాన్నగారు అన్నయ్యని ఎత్తుకొని హ్యాంగింగ్ గార్డెన్స్‌కు తీసుకెళ్లి నిద్రపుచ్చేవారట. రాజ్‌కపూర్ (హిందీ నటుడు, దర్శక–నిర్మాత)గారి కుటుంబంతో, నాన్నగారికి మంచి అనుబంధం ఉండేది.
వాళ్ల ఇంట్లో ఉన్న పాత ఊయల అన్నయ్య కోసం పంపారట. ఆ స్థాయిలో ఉన్నప్పుడు రాజ్‌కపూర్ కుటుంబంతో ఏర్పడిన పరిచయం నాన్నగారు గొప్ప స్థాయికి ఎదిగే వరకూ అలానే ఉంది. నాన్నని ఎంతగానో గౌరవించేవారు. ఇక్కడ తీసిన ‘ఇలవేల్పు’ సినిమాను ‘శారదా’ పేరుతో రాజ్ కపూర్, మీనాకుమారీలతో హిందీలో తీశారు.
గేట్ కీపర్‌గా చేసిన థియేటర్లో శతదినోత్సవం
బొంబాయిలో డ్రీమ్‌ల్యాండ్ థియేటర్‌కి కొన్ని రోజులు గేట్ కీపర్‌గా పని చేశారు నాన్నగారు. డైరెక్టర్‌గా ఆయన తీసిన ‘కిలోనా’ సినిమా వందరోజుల ఫంక్షన్ డ్రీమ్‌ల్యాండ్ థియేటర్లోనే జరిగింది. ఏ థియేటర్లో అయితే గేట్ కీపర్‌గా చేశారో ఆ థియేటర్లో దర్శకుడిగా ఆయన పేరు పడటం, ఆ సినిమా వంద రోజులాడటం.. అది చాలు ఆయన అచీవ్‌మెంట్‌కి. ఆయన కెరీర్ గ్రాఫ్ గమనిస్తే గేట్ కీపర్ టు దాదా సాహెబ్ ఫాల్కేగా ఎదిగారు.
ఆ రోజు నాన్న చెంప ఛెళ్లుమనిపించారు
నాన్నగారు రోజుకు 20గంటలు పనిచేసేవారు. మేం నిద్రలేచే సరికి షూటింగ్‌కు వెళ్లిపోయేవారు. మేం నిద్రపోయాక ఇంటికొచ్చేవారు. ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించలేని ఫీల్డ్ కాబట్టి నాకు సినిమాలవైపు ఇంట్రెస్ట్ కలగలేదు. అయితే ‘సంసారం’ సినిమాలో నాతో ఒక క్యారెక్టర్ చేయించాలని నాన్నగారు అనుకున్నారు. కానీ నాకు ఇష్టం లేదు. ఒకసారి ఆదివారం కూడా షూటింగ్ చేశారు. కరెక్ట్‌గా ఆ రోజు మ్యాచ్ ఉంది.
నాన్నగారి దగ్గరికెళ్లి కాసేపటికోసారి ‘వెళ్లొచ్చా?’ అని అడిగాను. ‘కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. వెళ్లిపోతే నిర్మాతకు నష్టం వస్తుంది’ అని అన్నారు. ఇంకోసారి అడిగితే చెంప ఛెళ్లుమనిపించారు. ఆ తర్వాత నాన్నగారు యాక్ట్ చేయమని మా ఇంట్లో ఎవ్వర్నీ ఫోర్స్ చేయలేదు. ఇప్పటికీ ‘సంసారం’ చూస్తే ఎన్టీఆర్‌గారు, ఏయన్నార్‌గారు ఉన్న ఫ్రేమ్‌లో నేనొక్కడినే మిస్ఫిట్లాగా అనిపిస్తుంది. కెమెరా, మైక్ అంటే నాకు చాలా ఇబ్బంది.
మాట మీద నిలబడ్డ వ్యక్తి
గొప్ప దర్శకుడు అనే పేరుతో పాటు నాన్నగారు ‘మాట మీద నిలబడే మనిషి’ అనే పేరూ సంపాదించుకున్నారు. నాన్నగారు తమిళంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలకు కరుణానిధి (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)గారు డైలాగ్స్ రాశారు. ఓ సినిమా విషయంలో ‘పదివేలు ఇస్తేనే రాస్తా’ అన్నారట. ‘సినిమా బాగా ఆడితే ఇస్తా’ అన్నారట.
సినిమా సూపర్ హిట్ అయింది. అన్న ప్రకారం పది వేలు ఇచ్చారట ‘‘ప్రసాద్ గొప్ప వ్యక్తి. చెప్పిన మాట మీద నిలబడే కొద్దిమందిలో ప్రసాద్ ఒకరు’’ అని కరుణానిధిగారు అన్నారు. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు డబ్బులు అవసరం ఉండి నిర్మాత గోగినేనిని అడిగారు. కొన్ని రోజులకు ఆ డబ్బు ఇచ్చేశారు. ‘ఇండస్ట్రీలో తీసుకున్న డబ్బు తిరిగిచ్చింది నువ్వే’ అన్నారట గోగినేనిగారు.
అందుకే ‘ఎల్వీ ప్రసాద్ ఐ’ హాస్పిటల్
ప్రేక్షకులు తన సినిమాలు ‘చూడడం’ వల్లే గొప్ప స్థాయికి ఎదిగానని నాన్నగారు అనేవారు. మరి.. చూపు లేనివాళ్ల పరిస్థితి ఏంటి? అనుకున్నారు. ఆ ఆలోచన వచ్చాక ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’ ఏర్పాటు చేశారు. ఇలాంటి ట్రస్ట్ నడపాలంటే ఎవరు కరెక్ట్ అనుకుంటున్న సమయంలో నా ఫ్రెండ్, డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు గుర్తొచ్చారు.
అమెరికాలో బాగా సంపాదించి, స్వదేశం కోసం ఏదోటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘ఐ’ ఇన్స్టిట్యూట్ కోసం కోటి రూపాయలతో ట్రస్ట్ స్టార్ట్ చేశాం. హాస్పిటల్ నిర్వహణ కోసం నాగేశ్వరరావుగారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేశారు. ‘వైట్ కార్డ్’ ఉన్నవారికి ఇక్కడ ఉచితంగా చికిత్స చేస్తాం.
మా అమ్మగారు గ్రేట్ లేడీ
పుట్టినప్పటి నుంచి నేనైతే కష్టాలు ఎప్పుడూ చూడలేదు. అప్పటికి నాన్నగారు మంచి పొజిషన్లోనే ఉన్నారు. పిల్లల్ని బాగా చదివించారు. నేను అమెరికాలో ఇంజనీరింగ్ చేశాను. నాన్నగారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కుటుంబం ఆనందంగా ఉందంటే దానికి కారణం మా అమ్మగారే. కేవలం మమ్మల్ని చూసుకోవడమే కాదు.
మా పనివాళ్లని, డ్రైవర్స్‌ని కూడా బాగా చూసుకున్నారు. చాలా మంది పెళ్లిళ్లు కూడా అమ్మగారే దగ్గరుండి చేశారు. మా నాన్నగారి ఊరిలో తాగునీటి సమస్య ఉండేది. దాంతో ఊరు మొత్తం తాగు నీటిని ఏర్పాటు చేశారు. అలాంటివి చాలా చేశాం.
నాన్నగారి ముందు మేం తక్కువే
నాన్నగారి చివరి రోజుల వరకూ కూడా సినిమానే శ్వాసగా బతికారు. ఆదివారాలు కూడా పనిచేశారు. ఇండస్ట్రీలో నాన్నగారు సంపాదించిన గుడ్ విల్ వెలకట్టలేనిది. మేం ఎంత సంపాదించినా ఆయన తెచ్చుకున్న పేరు ముందు చాలా తక్కువే. 100 రూపాయలతో ప్రయాణం స్టార్ట్ చేసిన ఎల్వీ ప్రసాద్ అనే వ్యక్తి ఆలోచనల్ని, ఆశయాల్ని ఇప్పుడు సుమారు 1500 మంది ఉద్యోగులంతా కలసి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన లైఫే మా అందరికీ ఇన్స్పిరేషన్.
నాన్నగారు ఎప్పుడూ మాతోనే ఉంటారు – విశ్వనాథరెడ్డి
(తండ్రి నాగిరెడ్డితో విశ్వనాథరెడ్డి)
అందరికీ తెలిసిన మా నాన్నగారి గురించి ఏం చెప్పను? నిజానికి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన్నుంచి నేర్చుకున్నవి, చిన్ననాటి జ్ఞాపకాలు ఇలా ఒక కొడుకుగా జీవితాంతం ఆయన గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. అందుకే ఈ ‘నాన్నతో నేను’ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పదలిచాను. ‘పుట్టాం–పెరిగాం–జీవించాం’ అనికాక ‘ఇతరుల కోసం జీవించేదే జీవితం’ అని నిరూపించిన సాధకుడాయన.
స్వాతంత్య్రోద్యమంలో...
పొట్టిపాడు అనే చిన్న గ్రామంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టారు నాన్నగారు. మా తాతగారు ‘ఎక్స్పోర్ట్’ బిజినెస్ చేసేవారు. ఉల్లిపాయల వ్యాపారం. నాన్నగారిని ఆయన 14వ ఏట మదరాసు తీసుకెళ్లారు. అక్కడ స్కూల్లో చేర్చితే చదువు మీద ఆసక్తి లేని కారణంగా నాన్నగారు చదువుకోలేదు. స్వాతంత్య్రోద్యమాల్లో పాల్గొన్నారు.
ఇలా అయితే లాభం లేదనుకుని నాన్నగారిని సొంతూరికి పంపించేశారు. అక్కడ ‘ఖాదీ మూమెంట్’లో పాల్గొన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల నాన్నగారిని మళ్లీ మదరాసు తీసుకెళ్లారు. చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడంతో ఎక్స్పోర్ట్ బిజినెస్ నిమిత్తం నాన్నగారిని తాతగారు రంగూన్ పంపారు. అప్పుడు మదరాసులో ‘బీఎన్కే’ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు.
అప్పటికి మా పెదనాన్న (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి – బీఎన్ రెడ్డి) మూడు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన ‘స్వర్గసీమ’ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ చిత్రనిర్మాత చక్రపాణిగారితో నాన్నగారికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలసి ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు.
వాహినీ.. విజయా వాహినీ అయింది
అప్పట్లో ‘వాహినీ స్టూడియోస్’కి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. మూల నారాయణస్వామి మేజర్ పార్టనర్. స్టూడియోస్కి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ వస్తే.. ‘సేవ్’ చేయడం కోసం నాన్నగారు స్టెప్ ఇన్ అయ్యారు. మా అక్క పేరు జయ. ఆ పేరు, ఆంజనేయుడు, అర్జునుడు పేర్లు కలిసొచ్చేట్లుగా ‘విజయా వాహిని’ పెట్టారు.
‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్‌ని ఆ స్టూడియో బేనర్ మీద తీశారు. వ్యాపారం, పత్రిక, చిత్రరంగం, వైద్యరంగాల్లో నాన్నగారు పేరుప్రఖ్యాతులు సంపాదించారు. దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు.
చెన్నై వదిలేది లేదన్నారు
సినిమాల్లోకి రాకముందు నాన్నగారు ‘చందమామ’ పత్రిక నడిపేవారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌గారు ‘చందమామ’ పత్రికకు అభిమాని. ఆయన నాన్నగారితో ‘చందమామ పబ్లికేషన్స్’ను ఢిల్లీకి మార్చమని అక్కడ తగిన స్థలం కేటాయిస్తానని చెప్పారు. అప్పుడు నాన్నగారు ‘‘చెన్నై నా సొంత ఇల్లు. దాన్ని వదిలి నేనెక్కడా ఉండలేను’’ అన్నారు.
ఉమ్మడి కుటుంబాన్ని ఇష్టపడేవారు
మేం ఉమ్మడి కుటుంబంగా ఉండడాన్నే మా నాన్నగారు ఇష్టపడేవారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డిగారున్న రోజుల్లో ఆయన హిందీ, ఇంగ్లిష్, తెలుగు, ఇతర ఉత్తరాది భాషల్లో వస్తున్న ‘చందమామ’ను హైదరాబాద్ నుంచే తీసుకురావచ్చునని అభిప్రాయపడ్డారు. అందుకు తగిన స్థలాన్ని హైదరాబాద్‌లో ఇస్తానని కూడా చెప్పారు. మేం కూడా వెళ్ళి ఆ స్థలాన్ని చూసి వచ్చాం.
ఇది విన్న నాన్నగారు బాధపడ్డారు. పత్రికా సంస్థలో ఒక భాగం హైదరాబాద్ నుంచి పని చేస్తే, అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. వృత్తిరీత్యా కూడా మా అన్నదమ్ములు విడిగా ఉండటం ఆయనకు ఇష్టంలేదు. అందువల్ల ఆ విషయాన్ని అంతటితో వదిలేశాం. వాస్తవంగా చెన్నై, వడపళని ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లడానికి ఆయన ఇష్టపడలేదు.
గెలుపు–ఓటములు గురువులాంటివి
ఏ పనిచేసినా సంపూర్ణ భక్తి శ్రద్ధలతో, నిబద్ధతతో చేయాలనేది ఆయన సంకల్పం. ‘సుఖదుఃఖాలకు మనసులో సమస్థితి కల్పించండి’ అనేవారు. ‘గెలుపు–ఓటములు రెండూ గురువు లాంటివి’ అని, జీవితంలో ఆ రెంటినీ సమంగా స్వీకరించారు. ‘సింహానికి సకల వసతులూ కల్పించినా, అది వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవాలి. కఠినంగా శ్రమిస్తేనే ఫలితం లభిస్తుంది’ అనేవారాయన.
గతాన్ని ఎప్పుడూ మరచిపోలేదు
వృత్తిలో ఎంత పోటీ ఉన్నా కొందరితో చేతులు కలపడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. నీతీ నిజాయితీగా ఉండేవాళ్లతోనే చేతులు కలిపేవారు. అవి లేనివాళ్లతో చేతులు కలిపితే మనసులో ప్రశాంతత కొరవడుతుంది అనేవారాయన. ‘నీకు నెలకు వెయ్యి రూపాయలు జీతం వస్తున్నప్పుడు నెలకు పదివేలు సంపాదించే వారితో పోల్చుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు.
ఐదొందలు సంపాదించేవారితో పోల్చుకుంటే ప్రశాంతత లభిస్తుంది’ అంటుండేవారు.ఆయన గతాన్నెప్పుడూ మరిచిపోయేవారు కాదు. చిన్న వయసులో చదివిన, నేర్చుకున్న పురాణాలు, ఇతిహాసాలలోని మంచిని ఆయన తరచూ గుర్తుంచుకునేవారు. నాన్నగారు గుప్తదానాలు చేసినా బయటకు చెప్పుకోలేదు. ఆయన వద్ద సాయం పొందినవారు చెబితే ఆయన దానగుణం తెలిసేది.
నా జీవితంలో ఎన్నో పదవులు నిర్వహించాను. వాటికి మూలకారణం – ‘నాగిరెడ్డిగారి కుమారుడు’ అవడం. రెండవ కారణం– తల్లిదండ్రులను గురువులుగా భావించి వారినుంచి గ్రహించిన అనుభవపాఠాలు. నాన్నగారు భౌతికంగా లేకపోవచ్చు. మానసికంగా ఎప్పుడూ మాతోనే ఉంటారు. నా గురువు, మార్గదర్శి ఆయనే.
వీల్ ఛైర్లో కూర్చుని...
మా నాన్నగారు 1997లో జబ్బుపడటంతో ఇక ఎప్పటిలా అన్ని పనులూ నిర్వహించలేనని గ్రహించారు. అయితే ఆ విషయం బహిర్గతం కాకుండా – ఆస్పత్రుల నిర్వహణకు ఓ కమిటీని ఏర్పరచారు. ఆస్పత్రులకు సంబంధించిన చిన్న పనైనా, పెద్ద పనైనా – ఆ కమిటీ చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలి.
వెంటనే ఆ నిర్ణయాన్ని నాన్నగారికి తెలియచేసి, ఆయన అంగీకారంతోనే దాన్ని ఆచరణలో పెట్టాలి. నాన్నగారు వీల్‌ఛైర్‌లో కూర్చుని ఆస్పత్రి పనులను పర్యవేక్షిస్తున్న కాలంలో– ఆయన్ను కలుసుకోవడానికి చాలామంది వస్తుండేవారు. వాళ్లల్లో చిత్రసీమకు చెందినవాళ్లతో మాట్లాడినప్పుడు నాన్నగారికి మళ్లీ సినిమాలు తీయాలనే ఆలోచన తలెత్తేది.
నాన్నగారి చివరి కథ ధనమా? గుణమా?
సినిమాలు తీయాలని నాన్నగారు తయారు చేసుకున్న కథల్లో ‘ధనమా గుణమా?’ ఒకటి. అయితే ఆరోగ్యం సహకరించదు కదా. ఆ పరిస్థితుల్లో... అప్పట్లో 2000 సంవత్సరానికి మిలీనియం కార్నివాల్‌ను నిర్వహించాం. ఆ కార్యక్రమాల నిర్వహణలో మీడియా పార్టనర్‌గా జయా టీవీవారు మాకెంతగానో సహకరించారు. దాంతో ‘ధనమా? గుణమా?’ కథను ‘ఎంగవీట్టు పెణ్’ పేరుతో నేను టెలీ సీరియల్‌గా నిర్మించి – జయా టీవీలో టెలికాస్ట్ చేయిస్తానంటే నాన్నగారు అంగీకరించారు.
ఆ సీరియల్ కోసం వెయిట్ చేసేవారు
నాన్నగారు చివరిగా ఓ కథారచయితగా పాల్గొన్న ఆ టెలీ సీరియల్ 2001, సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. 45 వారాల పాటు ప్రతి సోమవారం రాత్రి 8.30 గుంటలకు ప్రసారమయ్యేది. ఎపిసోడ్ ప్రసారమయ్యే ముందు రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ వివరాలు అడిగేవారు. సోమవారం రాత్రి 8.30 గుంటలకు టీవీ దగ్గర కూర్చునేవారు. చూసిన ఎపిసోడ్‌కు సంబంధించిన పాత్రధారుల వస్త్రధారణ, మేకప్ వంటివి.. ఇంకా ఎంత బాగా ఉండొచ్చో చెప్పేవారు. 90 యేళ్ల వయసులోనూ ఆయనకు ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి, ఉత్సాహం ఇప్పుడు తలచుకున్నా ఆశ్చర్యంగా ఉంటుంది.
అనారోగ్యంతో మంచంపట్టిన మా నాన్నగారికి సేవచేసే భాగ్యాన్ని నాకు కరుణించిన ఆ భగవంతునికి నేను ఋణపడి ఉన్నాను. ఇది నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తాను. ఎన్ని జన్మలెత్తినా నాగిరెడ్డిగారు, శేషమ్మ దంపతులకు కుమారుడుగానే జన్మించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ‘‘ఒకరు చేసిన మంచిని మరవడం తప్పు. అలాగే ఒకరు చేసిన అపకారాన్ని అప్పటికప్పుడు మరవకపోవడం కూడా తప్పు’’ అనే సూక్తి ఇక్కడ ప్రస్తావించడం అవసరం అనుకుంటాను.
నాగిరెడ్డిగారంటే నాన్నకు చాలా గౌరవం
నాగిరెడ్డి–చక్రపాణిగార్లంటే నాన్నగారికి చాలా గౌరవం. నాగిరెడ్డి గారితో మంచి అనుబంధం ఉండేది. విజయా సంస్థలో సినిమాలు చేసినప్పుడు నాన్నగారికి నెల జీతం ఇచ్చేవారు. అప్పట్లో అంతే. నాగిరెడ్డిగారి భార్య చాలా మంచివారు. మేం పిల్లలం వాళ్లింటికి వెళ్లేవాళ్లం. వాళ్ల పిల్లలు విశ్వనాథరెడ్డి వాళ్లు మా ఇంటికి వచ్చేవారు. నేను చాలాసార్లు వాళ్ల ఇంట్లో భోజనం చేశాను.
అందుకే ప్రసాద్ ల్యాబ్స్ స్టార్ట్ చేశాం
ఎన్టీఆర్‌తో తీసిన ‘తల్లా? పెళ్లామా?’ సినిమా నాకు బాగా నచ్చింది. దాన్ని హిందీలో తీయాలనిపించింది. నాన్నగారి ద్వారా ఎన్టీఆర్‌గారి దగ్గర రైట్స్ తీసుకుని హిందీలో తీశాం. ఆ సమయంలో ఫిల్మ్ నెగటివ్స్కి గీతలు పడ్డాయి. వెళ్ళి ప్రింట్ చేసేవాళ్లను అడిగాను. రెండు మూడు సార్లు అడిగినా వాళ్లేం మాట్లాడలేదు. నచ్చకపోతే తీసుకెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడారు. ఆ రోజే నిర్ణయించుకున్నా.. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే ల్యాబ్ పెట్టాలని. అనుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్.
అప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ మొదలుపెట్టాం. సంపాదించినదాన్ని మళ్లీ సినిమాల్లోనే పెట్టాలనేవారు నాన్నగారు. ఓ సందర్భంలో ఉంటున్న ఫ్లాట్ చిన్నగా ఉంది.. వేరే ఫ్లాట్ తీసుకుందాం అని మేం అనుకుంటుంటే.. ‘వద్దు. ఏదో కెమెరా అమ్మకానికి వచ్చింది. అది తీసుకుందాం’ అన్నారు. ఇప్పుడు మాకున్న ఇంత ఎక్విప్‌మెంట్‌కి కారణం నాన్నగారే. సినిమాను క్రియేటివ్‌గానే చూశారు తప్పితే వ్యాపార కోణంలో చూడలేదు. నాన్నగారు క్రియేటివ్ సైడ్ ఉంటే నేను టెక్నికల్ సైడ్.
ఓసారి వాషింగ్టన్ డీసీ స్మిత్సోనియన్ మ్యూజియమ్‌లో ‘టు ఫ్లై’ ఐమాక్స్ సినిమా చూసి థ్రిల్ అయ్యాను. ఎలా అయినా ఐమాక్స్ని ఇండియా తీసుకురావాలనుకున్నాను. సాధించగలిగాను. నాన్నగారి తర్వాత రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశాం. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ప్రొడక్షన్‌కి దూరంగా ఉన్నాం. మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఓ సారి ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లాను. ఎప్పటికైనా ఆస్కార్ తీసుకు వచ్చే సినిమా చేయాలని ఆశ. మరి నెరవేరుతుందో? లేదో చూడాలి.
ఎల్వీ ప్రసాద్‌గారు మంచి వ్యక్తి
ఎల్వీ ప్రసాద్‌గారితో నాన్నగారికి మంచి అనుబంధం ఉంది. ప్రసాద్‌గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఫుడ్ లవర్. మేం వడపళనిలో ఉండేవాళ్లం. ఆయన కుటుంబం అడయార్‌లో ఉండేది. వడపళని నుంచి నన్ను అడయార్ తీసుకెళ్లేవారు. వెళ్లే దారిలో కొబ్బరినీళ్లు ఇప్పించేవారు. ఎల్వీ ప్రసాద్‌గారి కూతురు గృహలక్ష్మీ నాకన్నా పెద్ద. ఆమె నన్ను రైటింగ్, పెయింటింగ్ సైడ్ బాగా ఎంకరేజ్ చేశారు. మేమంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లం.
నేను చేసుకున్న పుణ్యం అది
మేం బడిలో చదివే రోజుల్లో మా తల్లిదండ్రులతో కుట్రాలం వెళ్ళాం. రోజూ ఉదయం అక్కడ నాన్నగారితో వాకింగ్ వెళ్ళేవాళ్లం. ఆ సమయంలో ఆయన నాకు వివేకానందుడు, బాపూజీ వంటి మహనీయుల గురించి, ఆత్మవిశ్వాసం, సహనం, కృషి, సాహసం లాంటి విషయాల గురించీ చెబుతుండేవారు. మనుషులు పొరబాట్లు చేయడం సహజం.
అయితే వాటిని అంగీకరించే పరిపక్వత, ధైర్యం కావాలి. సరళత, దోషాలు అంగీకరించడం, పెద్దలను గౌరవించడం లాంటివి నేర్చుకోవడం గురించి చెప్పేవారు. నేను ఇప్పుడు కొద్దో గొప్పో ఉన్నత స్థానంలో ఉన్నానంటే నాకు ఆయన నూరిపోసిన విషయాలే కారణం. ఆయన పుత్రుడిగా జన్మించడం నేను చేసుకున్న పుణ్యం.
చందమామ లోగో వెనక స్టోరీ అదే
80వ ఏట నాన్నగారు అనారోగ్యంపాలై, కంటిచూపు మందగించినప్పుడు నాతో ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన నాతో ‘నువ్వు ఆగర్భశ్రీమంతుడివి కావు. కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు వెళ్లొచ్చు’ అన్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒకనాడాయన ‘చందమామ’ లోగో ఎలా వచ్చిందో చెప్పారు.
‘బౌద్ధ జాతక కథలలో వచ్చే ఒక సంఘటనే ‘చందమామ’ లోగోగా ఎంపిక చేశాం. చంద్రునికి ఆహారంగా తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న కుందేలు త్యాగమే ఆ సంకేతం. ఇతరులకు సాయపడటానికి తమను తాము త్యాగం చేసుకోవడానికి సంసిద్ధులం కావాలి, సంకోచపడకూడదు’ అనేవారాయన. ‘కృతజ్ఞతను మరవని మనసు కావాలి. అదే నా మూలధనం’ అంటుండేవారు నాన్నగారు.