Bommireddy Nagireddy Death Anniversery Special Story In Telugu - Sakshi
Sakshi News home page

'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.. 'మాయాబజార్' సృష్టికర్త ఆయనే'

Published Tue, Feb 28 2023 3:20 PM | Last Updated on Tue, Feb 28 2023 6:57 PM

Bommireddy Nagireddy Death Anniversery Special Story On - Sakshi

భారతీయ చలన చిత్రసీమలో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి. నాగిరెడ్డి)ది చెరిగిపోని చరిత్ర. ‘పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్‌’ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన ఘనత నాగిరెడ్డిది. కళాసేవే కాదు ఆయన ఎందరికో విద్య, వైద్య సేవలు ఉచితంగా అందించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపారవేత్తగా రాణించి, ప్రముఖ నిర్మాతగా, స్టూడియో ఆధిపతిగా అసాధారణ సేవలు అందించిన మానవతావాది. ‘చందమామ’ పత్రికను అసంఖ్యాక భాషల్లో ముద్రించి అటు బాలలకు ఇటు పెద్దలకు కూడా నీతి బోధలు చేసిన ముందు చూపుగల  మహా మనిషి. వినోద విజ్ఞానాల కృషీవలుడు, విజయాదిత్యుడు,చందమామ పత్రిక, అద్భుత దృశ్యకావ్యం, మాయాబజార్‌ల సృష్టికర్త  బి.నాగిరెడ్డి వర్థంతి(ఫిబ్రవరి 25) సందర్భంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.

► నాగిరెడ్డి  కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం, ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామంలో 1912, డిసెంబర్‌ 2న రైతు కుటుంబంలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ అనే దంపతులకు జన్మించారు. నాగిరెడ్డికి ప్రముఖ దర్శకుడు, పద్మభూషణ్‌ బీఎన్ రెడ్డి స్వయానా అన్న. 

► ఎద్దులయ్యగారి కొత్తపల్లె గ్రామంలోని వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతం లాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పన్నేండేళ్లు వచ్చేసరికే పురాణేతిహాసాలను ఔపోసన పట్టేశారు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.

నిజంగానే తెలుగువారికి తమ సినిమాలతో పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం అందించిన ఘనులు నాగిరెడ్డి- చక్రపాణి. వారిద్దరు వ్యక్తులైనా ఏకప్రాణంగా సాగారు. వారి సినిమాలు కూడా తెలుగువారితో విడదీయరాని బంధం ఉంది. తొలి చిత్రం 'షావుకారు' నుంచి చివరి చిత్రం 'శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్' దాకా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారు నాగిరెడ్డి- చక్రపాణి. చక్కన్నది ఆలోచనయితే, నాగిరెడ్డిది ఆచరణగా ఉండేది.. అందుకే విజయావారి చిత్రాల్లో వారిద్దరి అభిరుచి తొణికిసలాడేది.

► 1947లో భారతీయ పత్రికా ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన పిల్లల మాసపత్రిక చందమామ ప్రారంభించారు. చందమామను చదవని తెలుగువారుండరు. తెలుగులోనే కాకుండా భారతదేశంలో మరో 12 భాషలకు చందమామ విస్తరించింది. నాగిరెడ్డి గారిని చందమామ రెడ్డి అని పిలిచేవారు. మహిళల కోసం ‘వనిత’ మాసపత్రికను, సినిమాల కోసం ‘విజయచిత్ర’ పత్రికను నడిపారు.

ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో:

1949-50 ప్రాంతంలో మద్రాసులోని వాహినీ స్డూడియోను కొని విజయా-వాహినీ స్టూడియోగా పేరు మార్చి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో 1970 ప్రాంతంలో స్టూడియోను మూసివేసి విజయా మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఏర్పాటు చేసి తద్వారా విజయా ఆసుపత్రి, విజయా హెల్త్‌కేర్‌ సెంటర్‌, విజయా హెల్త్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు.

1950లో విజయా ప్రొడక్షన్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అర్జునుడి రథం మీద రెపరెపలాడే పతాకమే విజయా సంస్థ చిహ్నం.  నాగిరెడ్డి పెద్దకూతురి పేరు జయలక్ష్మి. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం.తను పుట్టాకే ఇంట్లో బావిలో తియ్యటి నీళ్లు పడ్డాయి. అప్పటినుంచీ జయ అంటే ఓ సెంటిమెంటు. ఆమె పేరు కలిసొచ్చేలా ‘విజయా ప్రొడక్షన్స్’ అని పెట్టారు.

ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాలు నిర్మించారు. వీరి తొలిచిత్రం ‘షావుకారు’ తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాలను నిర్మించారు. పాతాళభైరవి, మాయాబజార్‌, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి బాక్సాఫీస్ హిట్‌ చిత్రాలను నిర్మించారు.

ఎన్టీఆర్‌ను, ఎస్వీ రంగారావును, సూర్యకాంతాన్ని, సావిత్రిని, ఓ పద్మనాభాన్ని తెలుగు సినీ రంగానికి అందించింది నాగిరెడ్డి. 1951లో నిర్మించిన పాతాళభైరవి సినిమా జానపద చిత్రాలకు ఓ నిఘంటువు. ‘సాహసం చేయరా డింభకా’ అంటూ నటనలో, నడకలో, వాచకంలో ఎస్వీ రంగారావు కొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసం గురూ’ అంటూ డింగరీ పాత్రలో పద్మనాభం కనిపిస్తాడు. 

తెలుగుజాతి మరచిపోలేని ‘మాయాబజార్’
1957లో నిర్మించబడిన మాయాబజార్‌ సినిమా తెలుగుజాతి మరచిపోలేని మధురమైన అద్భుత దృశ్యకావ్యం. సినిమా పరిశ్రమకు పెద్ద బాలశిక్ష. మాయాబజార్' స్థాయికి - సాంకేతిక నైపుణ్యంలో గానీ, నటనలోగానీ - ఏదీ సరితూగలేదన్నది జగద్విదితం. అందుకు ప్రధాన కారకులు - దర్శకులు కేవీ రెడ్డి, రచయిత పింగళి నాగేంద్రరావు.  'మాయాబజార్' విడుదలై ఇప్పటికీ 60 సంవత్సరాలు దాటుతున్నా అంతే ఆదరణ పొందుతున్న చిత్రం ఇదే.

పలు పదవులు చేపట్టిన నాగిరెడ్డి

1980 నుంచి 1983 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్నారు. వీరి హయాంలోనే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నిర్మించబడింది. ఆలిండియా ఫిల్మ్‌ సమ్మేళన్‌కు రెండు సార్లు అధ్యక్షులు. సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు నాలుగు సార్లు అధ్యక్షులు.

సాధించిన అవార్డులు:

1987లో నాగిరెడ్డి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును పొందారు. హిందీ చలనచిత్ర సీమలో, అక్కాచెల్లెళ్లు అయిన లతా మంగేష్కర్‌, ఆశాబౌంస్లే ఈ అవార్డును పొందగా.. తెలుగు సినిమా రంగంలో అన్నదమ్ములైన బీఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి ఈ అవార్డును పొందడం గమనార్హం. 1957లో మాయాబజార్‌, 1962లో గుండమ్మ కథకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు పొందారు. 1987లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. శ్రీకృష్ణదేవరాయ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేశాయి. తమిళనాడులో ‘తలైమామణి’ బిరుదుతో సత్కరించారు. 1965లో కన్నడలో తీసిన ‘మదువెమదినోడు’ సినిమాకు జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది.

పలు భాషల్లో చిత్రాలు: 
విజయా సంస్థ తమిళంలో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్లి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్లై (రాముడు-భీముడు), హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సినిమాలు తీశారు. నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్లై సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఎంజీఆర్‌తో ప్రత్యేక అనుబంధం: 

ఎంజీరామచంద్రన్‌తో నాగిరెడ్డికి ఉన్న ప్రత్యేక అనుబంధం గొప్పది. ఒకసారి నాగిరెడ్డికి జబ్బుచేసి ఆసుపత్రిలో వుంటే ఎంజీఆర్ (అప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు) స్వయంగా వచ్చి పరామర్శించడమే కాకుండా ఫారిన్‌ మందులు తెప్పిస్తానని చెప్పారు. ఎంజీఆర్ సూచన మేరకే నాగిరెడ్డి విజయా ఆసుపత్రి నిర్మించి దాని పరిపాలనా బాధ్యతల కోసం ఒక ట్రస్టు స్థాపించి దానికి అప్పగించారు.  ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షునిగా నాగిరెడ్డి నాలుగు సార్లు బాధ్యతలను నిర్వహించారు. ఇందిరా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజ నాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. నాగిరెడ్డి అనారోగ్యంతో తన 92వ ఏట 25 ఫిబ్రవరి 2004న మద్రాసులో మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement