దుర్గారాణీ.. ఎక్కడున్నావ్?
ఈ ఫొటోలోని మహిళ పేరు దుర్గారాణీ సింగ్ (ఒరిజినల్‌గా అయితే విద్యా బాలనే). వయసు.. 36 ఏళ్లు (ఈ సినిమా లెక్కల్లో రెండేళ్లు దాచేశారు). ఎత్తు.. ఐదు అడుగుల నాలుగు అంగుళాలు (హీల్స్ వేసుకుంటే ఇంకా ఎత్తుగా కనిపించే అవకాశం ఉంది). కిడ్నాపింగ్ అండ్ మర్డర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మోస్ట్ వాంటెడ్ లేడీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘కహానీ 2’ చూడమంటున్నారు దర్శకుడు సుజోయ్ ఘోష్. ఆయన దర్శకత్వంలో విద్యాబాలన్ ముఖ్యతారగా నటిస్తున్న చిత్రమిది.
2012లో విడుదలైన సూపర్‌హిట్ సస్పెన్స్ థిల్లర్ ‘కహానీ’కి సీక్వెల్. ఇందులో విద్యాబాలన్ డీ-గ్లామరస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విద్యా ఫస్ట్ లుక్‌ను ‘వాంటెడ్’ అంటూ టీవీలో న్యూస్ రీడర్ వార్త చదువుతున్నట్టు ఆసక్తికరంగా పోస్టర్ రూపంలో విడుదల చేశారు. అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకూ దుర్గారాణీ సింగ్ కిడ్నాప్ చేసింది ఎవర్ని? హత్య చేసింది ఎవర్ని? అనే వివరాలు సస్పెన్సే.