ఔను! ఆమె మోస్ట్ వాంటెడ్ మర్డరర్!!
పేరు: దుర్గారాణి సింగ్. వయస్సు 36 ఏళ్లు. శరీర ఛాయ తెలుపు. ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు. కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ఆమె మోస్ట్ వాంటెడ్ నిందితురాలు. ఆమె జాడ గురించి ఏమాత్రం తెలిసినా పోలీసులకు సమాచారం అందించండి అంటూ బ్రేకింగ్ న్యూస్ చదువుతున్న దృశ్యాన్ని.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’ కహానీ-2’ ఫస్ట్ పోస్టర్, టీజర్‌గా విడుదల చేశారు.
సుజయ్ ఘోష్ దర్శకత్వంతో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ’కహానీ’ సినిమా సూపర్ హిట్ అయింది. నయనతార కథానాయికగా ‘అనామిక’ పేరుతో శేఖర్ కమ్ముల తెలుగులో దీనిని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కహానీ’కి సీక్వెల్ రాబోతున్నది. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్‌లోనూ విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్, టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు.