ఇక సినిమాతో ఏడడుగులు!
ఏడడగులు వేసింది... రెండేళ్ళు తిరగకుండానే విడిపోవాల్సి వచ్చింది. భర్త విజయ్ నుంచి అమలాపాల్ విడిపోవాలనుకుంది. రేపో మాపో విడాకులు వచ్చేస్తాయ్. ఇక సినిమాలతోనే లవ్ కరెక్ట్ అనుకుంది. సినిమాను గాఢంగా ప్రేమించింది. ఇప్పుడు సినిమాతో ఏడడుగులు వేస్తోంది. ఏకంగా ఏడు సినిమాలు ఒప్పుకుంది.
► లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం! విడాకులు తీసుకోవాలని ఎవరూ పెళ్లి చేసుకోరు. కానీ, అదో గుణపాఠం. అంతిమంగా జరిగిందంతా నా మంచికే అనుకుంటున్నా. వివాహ బంధంలో సంతోషం కరవైనప్పుడు, ఆ బంధం నుంచి వెనకడుగు వేయడానికి ఏ మహిళా బాధ పడకూడదు. నేను కోరుకునేది అదే. కుటుంబ సభ్యుల మద్దతుతో నేనా బాధ నుంచి బయటపడ్డా. ముఖ్యంగా నా బ్రదర్ అభిజిత్ గురించి చెప్పాలి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సహాయం చేశాడు. తను లేకుండా నా లైఫ్ లేదు. మా ఇద్దరి అనుబంధం చాలా ప్రత్యేకమైనది.
► పెళ్లి, విడాకులు – ఇవేవీ నా కెరీర్‌పై ప్రభావం చూపలేదు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ... ప్రేక్షకులు, సినీ ప్రముఖులు నన్ను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు నేనెప్పుడూ సినిమాలకు దూరంగా లేను కదా! పెళ్లైన తర్వాత విడుదలైన ‘వేల ఇల్లా పట్టదారి’ (వి.ఐ.పి) మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేశా. ఇప్పుడూ మంచి ఛాన్సులు వస్తున్నాయి.
► ప్రస్తుతం ‘వీఐపీ–2’, ‘తిరుట్టు పయలే–2’లతో పాటు మరో రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళ సినిమాల్లో నటిస్తున్నా. సుదీప్‌కి (‘ఈగ’ విలన్) జోడీగా నటించిన ‘హెబ్బులి’ ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమకి కథానాయికగా పరిచయమవుతున్నా. ఈ ఏడు సినిమాలూ 2017లోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ నా దగ్గరకి వస్తున్నాయి.
► ఓ సినిమాకి సంతకం చేసేటప్పుడు నా దృష్టంతా కథ, అందులో నా పాత్రపైనే ఉంటుంది. హీరో ఎవరు? అనేది పట్టించుకోను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... నటించిన సినిమాల పట్ల హ్యాపీగా ఉండాలి. ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాల పట్ల నేను హ్యాపీగానే ఉన్నా.
► ఓ మలయాళ సినిమాలో పాట పాడుతున్నా. నేను కవితలు కూడా రాస్తుంటా. అలాగని రచన, దర్శకత్వం వైపు దృష్టి పెట్టడం లేదు. రాబోయే కొన్నేళ్లు నా కాన్సంట్రేషన్ అంతా నటనపైనే. కుదిరితే హాలీవుడ్‌లోనూ నటించాలనుంది.
► నా వ్యక్తిత్వానికీ, బాడీకీ సూటయ్యే డ్రెస్సులు వేసుకుంటాను. నేనో హీరోయిన్ కాబట్టి నా డ్రెస్సులను చాలా మంది జడ్జ్ చేస్తున్నారు. వాళ్లను నేనేమీ అనడం లేదు. కొంతమంది ఏ కారణం లేకుండా విమర్శిస్తున్నారు. విడాకుల తర్వాత నా లైఫ్, లైఫ్‌సై్టల్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఈ సిల్లీ కామెంట్స్‌కి స్పందించి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు.
► తెలుగు సినిమాలకు వస్తే... నేను ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించా! అయితే... ఇప్పుడు 4 పాటలు, ఐదు సీన్లకు పరిమితమయ్యే పాత్రల్లో నటించడం ఇష్టం లేదు. నటిగా నా ప్రతిభను ప్రేక్షకులకు చూపించే సినిమాలు చేయాలనుకుంటున్నా. తమిళ, మలయాళ భాషల్లో మంచి ఛాన్సులు వస్తున్నాయి. అందువల్ల, తెలుగుకి కొంచెం దూరమయ్యా. త్వరలో ఓ మంచి సినిమాతో మళ్లీ వస్తా!! ప్రస్తుతం రెండు తెలుగు సినిమా ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.
► ఐ లవ్ ట్రావెలింగ్. వరుసగా సినిమాలు చేయని టైమ్‌లో కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లా. ‘సోలో ట్రిప్స్ అయితే సో బెటర్’ అని నా ఫీలింగ్. కొత్త సంస్కృతులు, అందమైన ప్రదేశాలు చూసే అద్భుతమైన అవకాశం వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... ట్రావెలింగ్ నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి సహాయపడింది.