ఈ ఘనత నా చెల్లెలిదే అని గర్వంగా చెప్పుకుంటుంటా - దాసరి
‘‘నా తొలి సినిమా ‘తాతామనవడు’లో కథానాయిక విజయనిర్మలే. నటిగా, దర్శకురాలిగా ఆమె సాధించిన ఘనత తెలుగువారందరికీ గర్వకారణం’’ అని దాసరి నారాయణరావు అన్నారు. గురువారం విజయనిర్మల పుట్టినరోజు వేడుక హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయనిర్మలకు శుభాకాంక్షలు అందిస్తూ దాసరి మాట్లాడారు. ‘‘దాదాపుగా యాభై చిత్రాలకు దర్శకత్వం వహించడం సాధారణమైన విషయం కాదు. ‘ఈ ఘనత సాధించింది నా చెల్లెలే’ అని గర్వంగా చెప్పుకుంటుంటాను. తను ఇలాగే వందేళ్ల పుట్టినరోజు కూడా జరుపుకోవాలి’’ అని దాసరి ఆకాంక్షించారు. ‘‘మా ఇంట్లో ఏ వేడుక జరిగినా... ప్రధాన అతిథులు అభిమానులే. ఈ వేడుకను ఘనంగా నిర్వహించడంలో వారి పాత్ర చాలా ఉంది. అభిమానుల ఆశీర్వాద బలమే మమ్మల్ని చల్లగా చూస్తోంది’’ అని కృష్ణ చెప్పారు.
అనారోగ్య కారణంగా ఆరు నెలలు అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చిందని, పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఆత్మీయులందర్నీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని విజయనిర్మల అన్నారు. అభిమానుల ఆశీర్వాదం ఉంటే మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటాననే ఆకాంక్షను ఆమె వెలిబుచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. నరేష్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.