ఆ ఇద్దరి చిత్రానికి కథ రెడీ
నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సంఘ భవన నిర్మాణ నిధి కొరకు ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇంతకు ముందే వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో తాను, కార్తీ కలిసి నటించనున్నట్లు తెలిపారు. ఆ చిత్రానికి కథ ఏమిటి? దర్శకుడెవరు అన్న విషయాలపై చాలా ఆసక్తి నెలకొంది. అలాంటి వాటన్నింటికి నటుడు విశాల్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 23వ తేదీన సినీయర్ దర్శకుడు కే.సుభాష్ కన్నుమూసిన విషయం తెలిసిందే. క్షత్రియన్, అభిమన్యు, ఏలైయిన్ సిరిప్పిల్, సుభాష్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కే.సుభాష్ పలు తమిళ, హిందీ చిత్రాలకు కథలను అందించారు.
ఆయన రాసిన చివరి కథ కరుప్పురాజా వెళ్‌లైరాజాలో నటుడు విశాల్, కార్తీ కలిసి నటించనున్నారు. ఈ విషయం గురించి విశాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరణించిన సుభాష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన విషయం తెలిసిందే. తాను నటుడవుతానని చెప్పిన తొలి వ్యక్తి సుభాష్ అని, ఈ విషయాన్ని తానెప్పుడూ మరచి పోనని విశాల్ అన్నారు. సుభాష్ రాసిన చివరి కథ కరుప్పురాజా వెల్లైరాజాలో తాను, కార్తీ హీరోలుగా నటించనున్నామని, ప్రభుదేవా దీనికి దర్శకత్వం వహించనున్నారని పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే కరుప్పురాజా వెల్లైరాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు.