విశాల్‌తో రొమాన్స్‌కు శ్రుతి రెడీ
Published Sat, Dec 28 2013 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
హీరోల వారసురాళ్లతో రొమాన్స్ చేస్తున్న లక్కీ హీరోగా విశాల్ పేరు తెచ్చుకుంటున్నారు. పట్టత్తుయానై చిత్రంలో సీనియర్ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్యతో రొమాన్స్, ఆ తర్వాత మదగజరాజ చిత్రంలో నటుడు శరత్‌కుమార్ వారసురాలు వరలక్ష్మితో డ్యూయెట్లు పాడారు. తాజాగా ప్రఖ్యాత నటుడు కమలహా సన్ కూతురు శ్రుతిహాసన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నా రు. ఈ యువ నటుడు తాజాగా శివప్ప మనిదన్ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి హరి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు తామరభరణి అనే సక్సెస్‌ఫుల్ చిత్రం రూపొందింది. తాజా చిత్రంలో విశాల్ సరసన నటి శ్రుతిహాసన్ నటించనున్నారన్నది లేటెస్ట్ న్యూస్.
శ్రుతి ‘3’ చిత్రం తర్వాత కోలీవుడ్‌లో నటించలేదు. ఆమె తమిళ చిత్రం చేసి రెండేళ్లు అవుతుంది. 7 ఆమ్ అరివు, 3 చిత్రాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్నా విజయం ఖాతాను మాత్రం ఓపెన్ చేయలేదు. తెలుగు, హిందీ చిత్రాల్లో బిజీగా ఉండడంతో కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించలేక పోతున్నానని పేర్కొంటున్న శ్రుతిహాసన్‌కు విశాల్ చిత్రంలో టైలర్‌మేడ్ పాత్ర లభించిందట. ఆమెకు చక్కగా నప్పే పాత్ర అని దర్శకుడు హరి అంటున్నారు. శ్రుతిహాసన్ కూడా త్వరలో తమిళ చిత్రంలో నటించనున్నట్లు తన మైక్రోబ్లాగ్‌లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ఈ రేర్ అండ్ క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం ప్రారంభం కానుందట.
Advertisement
Advertisement