బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.. బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది. ఈ ఏడాది అతిపెద్ద మల్టీస్టారర్‌గా, బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ప్రమోటైన ‘వార్’కు పాజిటివ్ రివ్యూలతోపాటు ఆడియెన్స్ టాక్ కూడా బలంగా ఉండటంతో తొలిరోజు నుంచే రికార్డుస్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 53.35 కోట్లు రాబట్టి.. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన వార్.. రెండోరోజు గురువారం రూ. 23.10 కోట్లు, మూడో రోజు శుక్రవారం రూ. 21.25 కోట్లు సాధించింది. తొలి మూడు రోజుల్లోనే హిందీ వెర్షన్‌లో రూ. 96 కోట్లు, తెలుగు, తమిళ వెర్షన్‌లలో రూ. 4.15 కోట్లు సాధించి.. మొత్తం రూ. 100.15 కోట్లు వార్ తన ఖాతాలో వేసుకుంది.
బాక్సాఫీస్ వద్ద వార్ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు సాధించి.. రికార్డులు బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది. గురువారం, శుక్రవారం సాధారణ వర్కింగ్ డేస్ అయినప్పటికీ.. వార్ తిరుగులేని రీతిలో వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించిన ఐదో యశ్‌రాజ్ ఫిలిమ్స్ సినిమాగా వార్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇంతకుముందు ధూమ్-3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలు తొలి మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో చేరాయి.
బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు రికార్డు..
బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా వార్ నిలిచింది. గతంలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన మల్టీస్టారర్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తొలిరోజు 52.50 కోట్లు వసూలు చేయగా.. రూ. 53.35 కోట్లతో ఆ రికార్డును వార్ చెరిపేసింది. ఈ రెండు సినిమాలు యష్‌రాజ్ ఫిల్మిమ్స్ తీసినవే కావడం గమనార్హం.
ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అత్యధిక రోజు వసూళ్లు సాధించిన సినిమాగా వార్ మొదటిస్థానంలో ఉండగా.. భారత్ (42.30 కోట్లు), మిషన్ మంగళ్ ( 29.16 కోట్లు), సాహో (24.40కోట్లు), కళంక్ (21.60కోట్లు) వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రభావం వార్‌పై ఉంటుందని భావించారు. కానీ, అంతగా ఆ ప్రభావం లేదని వసూళ్లు చాటుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ సినిమాలో హృతిక్ కబీర్‌గా, టైగర్ ఖలీద్‌గా కనిపించనున్నారు. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులుగా ఎందుకు మారారు అన్నదే వార్ కథ. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతోపాటు పలు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment