మంచి స్క్రిప్టులు దొరకాలే కానీ మరిన్ని ప్రేమకథా సినిమాల్లో నటించేం దుకు అభ్యంతరం లేదని జాతీయ అవార్డు గ్రహీత, మరాఠీ నటుడు ఉపేంద్ర లిమయే అంటున్నాడు. గిరీశ్ మోహితే తాజాగా రూపొందిస్తున్న ‘గురుపూర్ణిమ-ఏక్ లవెబుల్ స్టోరీ’ మనోడి తాజా సినిమా. సినిమాకు సంబంధించి అన్నింటికంటే తనకు కథే ముఖ్యమని, అదే ప్రేమకథైనా ఫర్వాలేదనని స్పష్టం చేశాడు. ‘మంచి స్క్రిప్టులు ఉంటే రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి అభ్యంతరాలు లేవు. నా వరకైతే కథే కీలకం. ఆసక్తికరంగా అనిపించే స్క్రిప్టుల కోసం నిరంతరం అన్వేషిస్తుంటాను’ అని ఉపేంద్ర వివరించాడు. గురుపూర్ణిమలో ఉపేంద్ర సరసన సాయి తమహంకర్ కనిపిస్తుంది.
కాలేజీ యువలెక్చరర్, విద్యార్థిని మధ్య నడిచే ప్రేమ వ్యవహారం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘గురుపూర్ణిమ నా మొదటి ప్రేమకథా సినిమా కాదు. నాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన జోగ్వా చిత్రంలోనూ ప్రేమకథ ఉంటుంది. ఇందులో సామాజిక సందేశం ఉన్నప్పటికీ, ఇది రొమాంటిక్ సినిమాయే’ అని ఉపేంద్ర వివరించాడు. ఇక గురుపూర్ణిమ సినిమా ట్రైలర్‌ను నిర్మాత మేధా మనోజ్ కాకులో, దర్శకుడు గిరీశ్, చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఇటీవల ముంబైలో విడుదల చేశారు.
ఇది సెప్టెంబర్ 12న థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రేమకథా సినిమాలతో ఉపేంద్ర బిజీగా ఉంటున్నా, కెరీర్‌లో ప్రారంభంతో మాత్రం ముక్తా, కల్ కా ఆద్మీ వంటి యాక్షన్ సినిమాలనే ఎంచుకున్నాడు. మధుర్ భండార్కర్ తీసిన ట్రాఫిక్‌సిగ్నల్, పేజ్ 3, చాందినీబార్ వంటి హిందీ సినిమాల్లోనూ నటించాడు. భారతీయ సినిమా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుందని, దానికి తగ్గట్టుగానే నటుడు స్క్రిప్టులను ఎంచుకోవాలని ఉపేంద్ర లిమయే అన్నాడు.
ప్రేమ కథలకూ సిద్ధమే!
Published Thu, May 15 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement