ప్రముఖ నటుడు, పద్మ శ్రీ గ్రహీత నానా పటేకర్ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాడు. ఎక్కువగా హిందీ, మరాఠి భాషల్లో నటించిన ఆయన మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో పాటలు కూడా పాడాడు. డైరెక్టర్‌గా 'ప్రహార్: ద ఫైనల్ అటాక్' అనే సినిమా కూడా తీశాడు. 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈయన 28 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత మొదటి కొడుకునూ కోల్పోయాడు. తాజాగా అతడు చిన్నతనంలో పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు.
దివాలా తీశాం..
'ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తండ్రీ పిల్లల మధ్య దూరం పెరుగుతోంది. మా చిన్నతనంలో ఇలా ఉండేది కాదు. బయటకు ప్రేమ చూపించుకోకపోయినా అది మా మధ్య అంతర్లీనంగా ఉండేది. మా నాన్న మా కోసం కష్టపడుతున్నాడన్న విషయం మాకు అర్థమయ్యేది. ఓసారి మా నాన్న వ్యాపారాన్ని ఎవరో లాక్కోవడంతో మేము దివాలా తీశాం. అప్పటివరకు ధనవంతుడైన మా నాన్న ఆ దెబ్బతో నడివీధిలో నిలబడాల్సి వచ్చింది. తను దిగాలుగా, ఏదో శిక్ష పడిన ఖైదీలా కూర్చునేవాడు.
ఒక్క పూట భోజనం.. ఆకలి..
అది చూసి నేను ఎందుకు నాన్న, అంత దిగులు చెందుతున్నావు? నీకు ఒక ఫ్యాక్టరీనే కదా పోయింది.. వదిలెయ్.. నీకింకా రెండు ఫ్యాక్టరీలున్నాయి. ఒకటి అన్నయ్య, రెండు నేను. ఎక్కువగా ఆలోచించకు, అంతా సర్దుకుంటుంది అని నచ్చజెప్పాను. 13 ఏళ్ల వయసులోనే పనికి వెళ్లడం మొదలుపెట్టాను. నెలంతా పని చేస్తే రూ.35 ఇచ్చేవారు, రోజుకు ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఇంటి దగ్గర అమ్మ, నాన్న తిన్నారా? లేదా? అన్న అనుమానం వచ్చేది. కానీ ఆకలికి ఆగలేక నేను తినేసేవాడిని' అని చెప్పుకొచ్చాడు.
ఆరోపణలతో నటుడిపై మరక!
చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకున్న నానా పటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా.. లైంగిక ఆరోపణలు చేసింది. మీ టూ ఉద్యమ సమయంలో ఆమె చేసిన ఆరోపణలు నిజమని రుజువు కాకపోయినప్పటికీ నానా మీద విమర్శలు వెల్లువెత్తాయి దీంతో కొంతకాలం పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే వ్యాక్సిన్ వార్‌లో కనిపించిన అతడు 'లాల్ బత్తి' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. అలాగే మరాఠీలో 'ఒలె ఆలె' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment