ఒకే హాలులో 1000 వారాల రికార్డు!
‘దిల్‌వాలే...’ ప్రదర్శనకు ఇక శుభం కార్డు
ముంబయ్‌లోని ‘మరాఠా మందిర్’ సినిమా థియేటర్లో ప్రస్తుతం ఆడుతున్న సినిమాను ఎత్తేసి, కొత్త సినిమాను ప్రదర్శించబోతున్నారు!సినిమా థియేటర్ అన్న తర్వాత ఆడుతున్న సినిమాను తీసేయడం, కొత్త సినిమా వేయడం సర్వసాధారణం. ఇదీ ఒక వార్తేనా? ఎవరైనా ఇలాగే అనుకుంటారు. కానీ... నిజంగా ఇది వార్తే. సాదాసీదా వార్త కాదు. దేశం మొత్తం నివ్వెరపోయేంత గొప్ప వార్త. ఎందుకంటే... ఆ థియేటర్‌లో ఇప్పటివరకూ ఆడుతున్న సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే’. షారుక్‌ఖాన్, కాజల్ జంటగా ఆదిత్యచోప్రా దర్శకత్వంలో యాష్‌చోప్రా నిర్మించిన ఈ చిత్రం ప్రేమకథాచిత్రాలకు ఓ వ్యాకరణం. 1995 అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైందీ సినిమా. అప్పట్నుంచీ ముంబయి మరాఠా మందిర్ థియేటర్‌లో ఆడుతూనే ఉంది.
అంటే సరిగ్గా ఈ నెల 20కి ఆ థియేటర్‌లో 19 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ‘దిల్‌వాలే దిల్హనియా లేజాయింగే’ చిత్రం ఆ థియేటర్లో విడుదలైనప్పుడు... ఆ సినిమా చూసి, దాని ప్రేరణతో ప్రేమలో పడ్డ జంటలు, పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కంటే... ఆ పిల్లలు కూడా పెళ్లీడుకొచ్చినా... ‘డీడీఎల్’ మాత్రం ఆ థియేటర్‌లో ప్రదర్శించబడుతూనే ఉంది. థియేటర్లో వారం రోజుల పాటు సినిమా నిలవడమే గగనమైపోతున్న రోజులివి. అలాంటిది వందలసార్లు టీవీల్లో ప్రదర్శితమైనా, వేలకొద్దీ డీవీడీలు మార్కెట్లో లభ్యమవుతున్నా... అవేమీ ఖాతరు చేయకుండా ఏకంగా 1000 వారాలు ‘దిల్‌వాలే...’ ప్రదర్శితమవ్వడమంటే దీన్ని ఎలాంటి విజయం అనాలి? సాధారణంగా రికార్డులు తిరగరాసిన సినిమాలను ‘బ్లాక్‌బస్టర్’ అంటాం.
ఆ ఒక్క సంబోధనతో సరిపెట్టే విజయం కాదిది. ‘డీడీఎల్’ ఓ చరిత్ర. చెరిగిపోని చరిత్ర. మళ్లీ తిరిగిరాని చరిత్ర. భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర. ఆ మాటకొస్తే... ప్రపంచంలోనే కనీవినీ ఎరగని చరిత్ర. ఇప్పటికే డీడీఎల్ ప్రేరణతో కొన్ని వందల చిత్రాలు రూపొందాయి. ఆ మాటకొస్తే ఇంకా రూపొందుతూనే ఉన్నాయి. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని దఫదఫాలుగా కాపీ కొట్టేశారు దేశంలోని చాలామంది దర్శకులు. ఈ సినిమా పుణ్యమా అని ముంబాయ్‌లోని సెంట్రల్ రైల్వేస్టేషన్‌కీ, బస్టాండ్‌కి అతి చేరువలో ఉన్న ఈ ‘మరాఠా మందిర్’ సినిమా థియేటర్... దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
ఈ నెల 20కి ‘డీడీఎల్’ 20వ ఏట అడుగుపెట్టబోతోంది. ఈ తరుణంలో ఇప్పుడు ‘డీడీఎల్’ వసూళ్లు తగ్గుముఖం పట్టాయని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఈ కారణంగా త్వరలోనే ఈ సినిమాను థియేటర్ నుంచి తొలగించి, మరో సినిమాను తీసుకోవాలని నిర్ణయించారు. ఇది డీడీఎల్ అభిమానులకు నిజంగా చేదువార్తే! అయినా ఈ సందర్భాన్ని కూడా థియేటర్లో ఘనమైన వేడుకగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ వేడుకకు డీడీఎల్ యూనిట్ మొత్తం రానున్నారు. - బుర్రా నరసింహ