పిల్లలు, మహిళలు నా సినిమాలు చూడకండి
సినిమా ప్రమోషన్ సమయంలో ఏ డైరెక్టర్ అయినా మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రచారం చేసుకుంటారు. అయితే తమిళ దర్శకుడు మిస్కిన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన సినిమాను చిన్న పిల్లలు, మహిళలు చూడొద్దంటూ తానే ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల 'తర్కపు' అనే తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న మిస్కిన్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పిశాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మిస్కిన్, ఈ వ్యాఖ్యలతో సౌత్ ఇండస్ట్రీలో సంఛలనం సృష్టిస్తున్నాడు.
సినిమా అంటేనే పెద్దలకోసం తీస్తారని, అలాంటి సినిమాలను కుటుంబ సమేతంగా చూడాలనుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు ఒకవేళ మీరు మీ పిల్లలతో కలిసి సినిమా చూడాలి అనుకుంటే ఏ యానిమేటెడ్ సినిమాకో లేక 'మై డియర్ కుట్టిచేతన్' లాంటి చిన్న పిల్లల సినిమాకో వెళ్లండి అంటూ ఘూటుగా స్పందించాడు. డైరెక్టర్ తాను అనుకున్న భావం తెర మీదకు రావటం కోసం కొన్నిసార్లు అసభ్యకరమైన పదాలు వాడక తప్పదని చెప్పాడు మిస్కిన్.
తన తదుపరి చిత్రానికి సెన్సార్ బోర్డ్ తప్పకుండా 'ఏ' సర్టిఫికేట్ ఇస్తుందన్న మిస్కిన్... పిల్లలు, మహిళలు మాత్రం ఆ సినిమాను చూడొద్దన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వటంలో మిస్కిన్ ధైర్యాన్నిమెచ్చుకున్నా, ప్రేక్షకుల్లో కేవలం ఒక వర్గం మాత్రమే చూస్తే సినిమా వసూళ్ల విషయంలో కష్టం అంటున్నారు సినీ జనాలు.