తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నిర్మాతల మండలి, యాక్టీవ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కలిసి నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ ప్రకటనలో వెల్లడించారు.
ముఖ్యంగా నటీనటులు ముందుగా నటించడానికి అంగీకరించి, అడ్వాన్స్ లు తీసుకున్న చిత్రాల్లోనే నటించాలని, అదే విధంగా నటీనటులపారితోషికం, నిర్మాణ వ్యయం వంటి విషయాల గురించి నూతన విధి విధానాలను నిర్ణయించే వరకూ నవంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపి వేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆగస్ట్ 16 తర్వాత కొత్త చిత్రాల ఆరంభానికి అనుమతి లేదని కూడా నిర్మాతల సంఘం పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్‌లను అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని తీర్మానం చేసింది.
అలాగే నటుడు ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారనీ, అందువల్ల ఆయనతో కొత్త చిత్రాలను నిర్మించే నిర్మా తలు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో చర్చించాకే ఆ సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టాలనే తీర్మానం చేశారు. కాగా నిర్మాతల మండలి తీర్మానాలపై నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సారాంశం ఈ విధంగా...తమిళ నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో నటీనటులకు సంబంధించిన తీర్మానాలు, నటుడు ధనుష్‌కు సంబంధించిన తీర్మానం తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని నటీనటుల సంఘం పేర్కొంది. ధనుష్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అకస్మాత్తుగా అతనిపై నిషేధం విధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని కూడా ఆ ప్రకటనలో ఉంది.
సమస్యను తమతో చర్చించకుండా తీర్మానించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. రెండు సంఘాలూ కలిసి మాట్లాడుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఏక పక్షంగా నిర్ణయించి, పత్రికా ప్రకటనలా ఇవ్వడం సరి కాదని కూడా నటీనటుల సంఘం అభిప్రాయపడింది. తమిళ సినీ సంఘాల్లో ముఖ్యమైన నటీ నటీనటుల సంఘం నిర్వాహకులను సంప్రదించకుండా వేలాది మంది నటీనటులు, కార్మికుల జీవితాలను బాధించే విధంగా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తాము విడుదల చేసిన నోట్‌లో నటీనటుల సంఘం పేర్కొంది.
ఈ ఏక పక్ష తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గంతో చర్చించి తగిన చర్యలు గురించి వెల్లడించడం జరుగుతుందని పేర్కొంది. – సాక్షి, చెన్నై
నిర్మాతల మండలి తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కార్తీ
నటీనటుల సంఘం కోశాధికారి, నటుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతల మండలి ఏక పక్షంగా చేసిన తీర్మాలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా నటుడు ధనుష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు.
నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లను సంపద్రించాకే పత్రికా ప్రకటన విడుదల చేశామని కూడా కార్తీ పేర్కొన్నారు. అదే విధంగా నడిగర్ సంఘాన్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తున్నట్లు నటీనటుల సంఘం ఉపాధ్యక్షుల్లో ఒకరైన కరుణాస్ కూడా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment