
మరో క్రేజీ ప్రాజెక్టుకు సై?
అల్లు అర్జున్ చెప్పలేనంత ఆనందంలో ఉన్నారు. రీల్ లైఫ్‌లో ‘రేసుగుర్రం’ ఘన విజయం. రియల్ లైఫ్‌లో తండ్రిగా ప్రమోషన్... ఇక ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది? ఇదే జోష్‌లో త్రివిక్రమ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు బన్నీ. ‘జులాయి’ చిత్ర నిర్మాత రాధాకృష్ణే ఈ చిత్రానికి కూడా నిర్మాత. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని తపించే హీరోల్లో బన్నీ ఎప్పుడూ ముందుంటారు. సినిమాల ద్వారా కొత్త కొత్త డాన్సుల్ని, భిన్నమైన ఫైటుల్ని, రకరకాల ఫ్యాషన్లనూ పరిచయం చేయడం ఆయన హాబీ. తెలుగుతెరకు సిక్స్‌ప్యాక్‌ని పరిచయం చేసింది కూడా బన్నీనే అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెరకు తెలియని భిన్నమైన విద్యల్ని అభ్యసించే పనిలో ఉన్నారు బన్నీ. మరి ఆ విద్యల్ని ఏ సినిమా కోసం ప్రయోగిస్తారో చూడాలి. ఇదిలావుంటే... ఇటీవల ఆయన ఓ కథ విన్నారట.
ఆ కథ బన్నీకి మహబాగా నచ్చిందని సమాచారం. నటిస్తానని సదరు నిర్మాతకు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చేశారట. ఆ నిర్మాత ఎవరో కాదు ‘దిల్’రాజు. ఆ దర్శకుడు వేణూ శ్రీరామ్. ఇంతకు ముందు ఆయన ‘ఓ మై ఫ్రెండ్’ తీశారు. వేణూ శ్రీరామ్ చాన్నాళ్లు శ్రమించి ఓ అద్భుతమైన కథను తయారు చేసుకున్నారట. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అనే టైటిల్ కూడా ఈ కథకు ఫిక్స్ చేశారట. ఆ కథనే బన్నీకి వినిపించారట వేణూ శ్రీరామ్, దిల్ రాజు. బన్నీకి కూడా కథ నచ్చేయడంతో ఇక ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఫిలిమ్‌నగర్ సమాచారం. మరి త్రివిక్రమ్ సినిమాతో పాటు సమాంతరంగా బన్నీ ఆ సినిమాను చేస్తారో, లేక ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తారో చూడాలి.