ముందల్ చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: సామాజిక దృక్పథంతో కూడిన భారీ యాక్షన్ కథా చిత్రంగా ముందల్ ఉంటుందని చిత్ర దర్శకుడు జయంత్ తెలిపారు. 250 చిత్రాలకు పైగా స్టంట్‌మాస్టర్‌గా పనిచేసిన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రం ఇది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం గురించి జయంత్ మాట్లాడుతూ ఒక స్టంట్ కళాకారుడిగా తన జీవితం ప్రారంభం అయినా దర్శకుడవ్వాలన్నది తన జీవిత లక్ష్యం అన్నారు.
అది ఈ ముందల్ చిత్రం ద్వారా నెరవేరిందని చెప్పారు. ఇది సామాజిక దృక్పథంతో కూడిన యాక్షన్ ఎడ్వెంచర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కాన్సర్ వ్యాధిని శాశ్వతంగా రూపుమాపే మందు ఫార్ములాను సిద్ధులు తాళపత్రాలపై రాసి వాటిని ఒక రహస్య ప్రదేశంలో భద్రపరచినట్లు కథానాయకుడికి తెలుస్తుందన్నారు. దాన్ని ఆ తాళపత్రాల గురించి కనిపెట్టి ఫార్ములాను ప్రభుత్వానికి అప్పగించి, తద్వారా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలని ప్రయత్నిస్తాడన్నారు.
ఇదే ఫార్ములా గురించి తెలుసుకున్న మరో ముఠా దాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. అయితే ఆ ఫార్ములా ఎవరికి లభిస్తుంది అన్నది చిత్ర కథ అని తెలిపారు. ఇందులో ఏడు ఫైట్స్ ఉంటాయని చెప్పారు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న అప్పుకృష్ణ పోరాట దృశ్యాల్లో నటించడానికి కుంగ్‌ఫూ, సిలంబ్బాట్టం వంటి విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారని చెప్పారు. అదే విధంగా పలు సన్నివేశాలను సముద్ర అడుగు భాగంలో చిత్రీకించినట్లు, అందుకు హీరో ఈత కూడా నేర్చుకుని నటించారని తెలిపారు.
విలన్‌గా నాన్‌కడవుల్ రాజేంద్రన్ అద్భుతంగా నటించారని చెప్పారు. చిత్రాన్ని ఏడు దేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంతవరకూ ఎవరూ షూటింగ్ చేయని కాంబోడియాలోని అంకూర్ వాడ్ ఆలయంలో పాట సన్నివేశాలను, ఫైట్ దృశ్యాలను చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణం కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు జయంత్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం కూడా సామాజక స్పృహతో కూడిన కథాంశంతోనే ఉంటుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment