‘యాత్ర’లో మమ్ముట్టి
‘నీళ్లుంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే నీళ్లుండవు.. రెండూ ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు.. అందరూ రైతే రాజు అంటారు.. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు’ అంటూ ఓ రైతు ఆవేదనతో చెప్పే డైలాగ్‌తో ‘యాత్ర’ టీజర్ విడుదలైంది. తన పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు.
వైఎస్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని శుక్రవారం ‘యాత్ర’ టీజర్‌ని విడుదల చేశారు. తాము పడుతున్న కష్టాలను రైతులు వైఎస్ పాత్రధారి మమ్ముట్టి దృష్టికి తీసుకురావటం.. అశేష ప్రజానీకం మధ్య ఆయన పాదయాత్ర చేస్తున్న సన్నివేశాలు టీజర్‌లో ఆకట్టుకున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రైతుకు ‘నేను విన్నాను.. నేనున్నాను’.. అంటూ మమ్ముట్టి భరోసా ఇవ్వడం వంటి సన్నివేశాలు వైఎస్ అభిమానులను అలరిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ‘యాత్ర’ సినిమా విడుదలవుతోంది. జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ తదితరులు నటిం చిన ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: కె, సమర్పణ: శివమేక.
Comments
Please login to add a commentAdd a comment