రాహుల్ గాంధీ, జస్టిస్ లోయా జతచేసిన చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయ మరణం చుట్టూ అల్లుకున్న రాజకీయ దుమారం నేపథ్యంలో ఆయన మరణంపై వాస్తవాలు వెలుగుచూస్తాయనే ఆశ మిగిలిఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. జస్టిస్ లోయాది సహజమరణమేనని దీనిపై స్వతంత్ర విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం ఆయన మృతిపై దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుతో ఇక ఆశలు ఆవిరైపోయాయని లోయా కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘లోయా కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నా.. అయితే ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయని వారికి చెబుతున్నా..లక్షలాది భారతీయులు వాస్తవాలను చూస్తా’రని రాహుల్ ట్వీట్ చేశారు.
జస్టిస్ లోయాను మరిచిపోయేందుకు భారత్ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. జస్టిస్ లోయా కేసుపై సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో గురువారం కూడా రాహుల్ బీజేపీ, అమిత్ షాలను టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. ఏదో ఒకరోజు బీజేపీ చీఫ్‌ను వాస్తవం వెంటాడుతుందని వ్యాఖ్యానించారు. సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో గతంలో అమిత్ షా నిందితుడిగా ఉన్న క్రమంలో ఈ కేసును డీల్ చేస్తున్న సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ లోయా మరణించడంపై దుమారం రేగింది.
Comments
Please login to add a commentAdd a comment