నిపా మృతులు 10 | 10 dead, 22 people quarantined due to Nipah virus in Kerala | Sakshi
Sakshi News home page

నిపా మృతులు 10

Published Wed, May 23 2018 1:21 AM | Last Updated on Wed, May 23 2018 1:21 AM

10 dead, 22 people quarantined due to Nipah virus in Kerala - Sakshi

న్యూఢిల్లీ: కేరళలో విజృంభిస్తున్న అరుదైన వైరస్‌ ‘నిపా’ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. మరో 11 మంది వైరస్‌ సోకి చికిత్స పొందుతున్నారు. ప్రజలెవరూ భయపడవద్దనీ, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నందున ఈ వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విజ్ఞప్తి చేసింది.

పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందనీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మి వాటిని ఇతరులకు పంపి ప్రజలను భయపెట్టవద్దని ఆ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రజలను కోరారు. కేరళ ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించాలని  కేంద్ర అధికారులను ఆదేశించారు. నిపా వైరస్‌ సోకిన లక్షణాలతో వచ్చే రోగులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని ఆసుపత్రులకు సూచించారు. ఇప్పటికే జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) నుంచి ఉన్నత స్థాయి వైద్య బృందాన్ని కేంద్రం కొజికోడ్‌కు పంపడం తెలిసిందే.

చికిత్స అందించేందుకు సిద్ధం
కేరళకు వచ్చి నిపా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, ఆ అవకాశాన్ని ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కళాశాల వైద్యుడు కఫీల్‌ ఖాన్‌ సీఎం విజయన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఖాన్‌ లాంటి వైద్యులను కేరళకు ఆహ్వానించడం తమ ప్రభుత్వానికి ఆనందమేననీ, ఇంకా ఇలా సేవ చేసేందుకు రావాలనుకునే వారెవరైనా ఉంటే తమ కొజికోడ్‌ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ను సంప్రదిస్తే అన్ని ఏర్పాట్లూ చేస్తారన్నారు. కాగా, గతేడాది ఆగస్టులో బీఆర్‌డీ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 63 మంది చిన్నారులు మరణించారు. ఈ కేసులో కఫీల్‌ ఖాన్‌ జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ కేసులో తనను ఇరికిస్తున్నారని అప్పట్లో ఖాన్‌ చెప్పారు.  


నిపా ఎలా వ్యాపిస్తుంది ?
పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఇతర జంతువులకి
 జంతువుల నుంచి జంతువులకి ద్రవాల ద్వారా
♦  గబ్బిలాలు కొరికి పడేసిన పండ్లు తింటే
 స్వేదం తదితర ద్రవాల ద్వారా మనుషుల్లో

ఎలా గుర్తిస్తారు?
 రక్త పరీక్షలు
♦  కండరాల్లో వచ్చే మార్పుల్ని గుర్తించడం
♦  వైరస్‌ను వేరు చేసి పరీక్షించడం

చికిత్స
 ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రత్యేకంగా టీకాలు లేవు
 రోగుల్ని విడిగా ఉంచి కృత్రిమ పద్ధతుల్లో శ్వాస అందిస్తూ స్వస్థతకు ప్రయత్నిస్తారు.  
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రిబావిన్‌ మాత్రల ద్వారా కొంత వరకూ ప్రయోజనం ఉండవచ్చు.  

మరణాల రేటు
 వ్యాధి సోకిన వారిలో దాదాపు 70 శాతం మంది మరణిస్తారు

భారత ఉపఖండంలో ఎప్పుడెప్పుడు వచ్చింది ?
 2001లో సిలిగుడి, పశ్చిమబెంగాల్‌.. 66 మందికి వైరస్‌ సోకగా 45 మంది మరణించారు.
 2011లో బంగ్లాదేశ్‌.. వైరస్‌ సోకిన 56 మందిలో 50 మంది మృత్యువాత

లక్షణాలు
 జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,  మత్తుగా ఉండటం.
 కొందరిలో మూర్ఛ లక్షణాలు కనిపిస్తాయి.
 10–12 రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి
 ఆ తర్వాత రోగి నెమ్మదిగా కోమాలోకి వెళ్లిపోతాడు
 బ్రెయిన్‌ ఫీవర్‌ వచ్చిందంటే అదే ఆఖరి స్టేజి, ఆ తర్వాత మరణం సంభవిస్తుంది.

జాగ్రత్తలు  
 జంతువులు, పక్షులు కొరికి వదిలేసిన పళ్లు తినకూడదు. గబ్బిలాలు తిరిగే చోట ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
 నిపా రోగుల దగ్గరకి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి
 రోగులకు సేవలు అందించేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌లు ,చేతులకు తొడుగులు ధరించాలి.


– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement