ఆధార్‌పై అనుమానాలొద్దు! | 11 questions on Aadhaar and its misuse, answered by the UIDAI | Sakshi
Sakshi News home page

ఆధార్‌పై అనుమానాలొద్దు!

Published Thu, Jan 18 2018 1:40 AM | Last Updated on Thu, May 24 2018 12:31 PM

11 questions on Aadhaar and its misuse, answered by the UIDAI  - Sakshi

న్యూఢిల్లీ:  కేవలం రూ.500కే దేశంలో ఎవరి ఆధార్‌ సమాచారమైనా ఆన్‌లైన్‌లో దొరుకుతోందంటూ ‘ద ట్రిబ్యూన్‌’ పత్రిక ఇటీవల బయటపెట్టి సంచలనం సృష్టించింది. అలాగే కొన్ని ప్రభుత్వ విభాగాల వెబ్‌సైట్ల నుంచే 13 కోట్ల మంది ఆధార్‌ సమాచారం బట్టబయలైందంటూ కూడా గతంలో వార్తలొచ్చాయి. అసలు ఆధార్‌ రాజ్యాంగ బద్ధమేనా కాదా అనే దానిపై సుప్రీంకోర్టు ఐదురుగు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నుంచి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆధార్‌పై సామాన్యుల సందేహాలను నివృత్తి చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) 11 ‘తరచుగా అడిగే ప్రశ్నలు’ (ఎఫ్‌ఏక్యూ), వాటికి సమాధానాలను విడుదల చేసింది.

ప్రశ్న: నా ఆధార్‌ సమాచారంలో బయోమెట్రిక్స్, బ్యాంక్‌ ఖాతా, పాన్, మొబైల్, ఈ–మెయిల్‌ తదితర వివరాలన్నీ ఉన్నాయి? నేను ఏమేం చేస్తానో యూఐడీఏఐ గమనిస్తూ ఉంటుందా?
జవాబు: తప్పు. యూఐడీఏఐ దగ్గర బ్యాంకు ఖాతాలు, పాన్, మ్యూచ్‌వల్‌ ఫండ్లలో పెట్టుబడులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యులు, కులం తదితర వివరాలేవీ ఉండవు.  

ప్రశ్న: కానీ నాకు బ్యాంక్‌ ఖాతా, పాన్‌ కార్డు, షేర్‌ మార్కెట్, మ్యూచ్‌వల్‌ ఫండ్లలో పెట్టుబడులు, మొబైల్‌ కనెక్షన్‌..ఇలా ఏది కావాలన్నా ఆధార్‌ అంటున్నారుగా. ఆయా సంస్థలకు నా ఆధార్‌ నంబర్‌ ఇస్తే ఆ సమాచారం యూఐడీఏఐకి రాదా?
జవాబు: కచ్చితంగా రాదు. మీరు ఆయా సంస్థలకు ఆధార్‌ సంఖ్య ఇచ్చినప్పుడు అవి మీరు వారికిస్తున్న బయోమెట్రిక్స్, మీ పేరు తదితరాలను మాత్రమే యూఐడీఏఐకి ధ్రువీకరణ కోసం పంపుతాయి. ఇతర వివరాలేవీ రావు. ఆధార్‌ నంబర్‌తో వేలిముద్రలు, పేరు సరిపోలితే ధ్రువీకరణ అయిపోతుంది.  

ప్రశ్న: ఎవరికైనా నా ఆధార్‌ నంబర్‌ తెలిస్తే, వాళ్లు నా బ్యాంక్‌ ఖాతాను హ్యాక్‌ చేయగలరు కదా?
జవాబు: పూర్తిగా అవాస్తవం. కేవలం మీ ఏటీఎం కార్డు నంబర్‌ తెలిసినంత మాత్రాన ఎవరైనా మీ ఖాతాలోని డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేయగలరా? అలాగే ఇది కూడా అసాధ్యం.

ప్రశ్న: బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించుకోవాలని ఎందుకు చెబుతున్నారు?
జవాబు: మీ భద్రత కోసమే. నేరస్తులు, అవినీతిపరుల బ్యాంకు ఖాతాలను తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ఖాతాల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బు తీస్తే వారి గురించి అన్ని వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. కాబట్టి మీ ఖాతాలకు మరింత భద్రత సమకూరుతుంది.

ప్రశ్న: మరి మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ ఎందుకు?
జవాబు: ఇది కూడా మీ భద్రత కోసమే. దేశ భద్రత కోసం కూడా. నేరస్తులు, మోసగాళ్లు వినియోగిస్తున్న సిమ్‌ కనెక్షన్లను తొలగించడం కోసమే అనుసంధానం చేసుకోమంటున్నాం. చాలాసార్లు నేరగాళ్లు నకిలీ ధ్రువపత్రాలతో సిమ్‌లు సంపాదించి నేరాలకు పాల్పడుతున్నారు. ఆధార్‌తో అనుసంధానించడం వల్ల దీన్ని నివారించవచ్చు.  

ప్రశ్న: మొబైల్‌ కంపెనీలు నా వేలిముద్రలను సేవ్‌ చేసుకుని తర్వాత వాటిని వేరే పనుల కోసం వాడుకునే అవకాశం ఉంది కదా!
జవాబు: ఆధార్‌ ధ్రువీకరణ సమయంలో మీరిచ్చే వేలిముద్రలను మొబైల్‌ కంపెనీలే కాదు, ఎవ్వరూ సేవ్‌ చేసుకోలేరు. సెన్సర్‌పై మీ వేలిముద్ర పెట్టగానే, ఆ సమాచారం ఎన్‌క్రిప్ట్‌ అయ్యి, సరిపోల్చడం కోసం యూఐడీఏఐకి వస్తుంది. ఆధార్‌ చట్టం–2016 ప్రకారం ఏవేనీ సంస్థలు మీ వేలిముద్రలను సేవ్‌ చేయడం శిక్షార్హమైన నేరం.

ప్రశ్న: ఎన్‌ఆర్‌ఐలకు కూడా ఆధార్‌ ఉండాల్సిందేనా?
జవాబు: లేదు. ఆధార్‌లో భారత్‌లో నివసిస్తున్న వారికి మాత్రమే. ఆధార్‌ను పొందేందుకు ఎన్‌ఆర్‌ఐలు అసలు అర్హులే కాదు. ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ లేకపోయినా అన్ని రకాల సేవలూ లభిస్తాయి.

ప్రశ్న: పేదవారికి అత్యవసరమైన పింఛను, రేషన్‌ సరకులు తదితరాలను కూడా ఆధార్‌ లేని కారణంగా నిలిపేస్తున్నారు కదా?
జవాబు: కచ్చితంగా లేదు. ఎవరైనా ఆధార్‌ కార్డు ఇంకా తీసుకోకపోతే, అలాంటి వారికి ఆధార్‌ సంఖ్య వచ్చే వరకు ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించాల్సిందేనని చట్టంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా ఆధార్‌ కచ్చితంగా కావాల్సిందేనని ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారిపై పై అధికారులకు ఫిర్యాదు చేయండి.

ప్రశ్న: కొన్ని సంస్థలు ఈ–ఆధార్‌ను ఒప్పుకోవడం లేదు. ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు కావాల్సిందేనని అవి పట్టుబడుతున్నాయి. ఎందుకు?
జవాబు: ఈ–ఆధార్‌ కూడా ఒరిజినల్‌ ఆధార్‌తో సమానమే. రెండింటిలో ఏదైనా ఒకటే. అన్ని సంస్థలూ రెండింటిలో దేన్నయినా అంగీకరించాల్సిందే. ఇంకా మాట్లాడితే ఒరిజినల్‌ ఆధార్‌ కన్నా ఈ–ఆధార్‌కే వారు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా ఈ–ఆధార్‌ను ఒప్పుకోకపోతే వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయండి.

ప్రశ్న: సామాన్యులకు ఆధార్‌తో ప్రయోజనమేంటి?
జవాబు: ఆధార్‌ అంటే 119 కోట్ల మంది భారతీయుల విశ్వసనీయమైన గుర్తింపు. ఇతర ఏ గుర్తింపు కార్డుకూ లేని విశ్వసనీయత ఆధార్‌కు ఉంది. పల్లెల నుంచి పట్టణాల్లోని మురికి వాడల వరకు ఎవ్వరినైనా అడగండి వారు ఆధార్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో. బ్యాంకు ఖాతాకు, ఉద్యోగానికి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో పొందేందుకు, రైళ్లలో ప్రయాణానికి ఇలా దేనికయినా సరే, గుర్తింపు కార్డుగా మొదటి ప్రాధాన్యత ఉన్నది ఆధార్‌కే.

ప్రశ్న: ఆధార్‌ సమాచారం లీక్‌ అయ్యిందంటూ మీడియాలో వార్తలు చూశాం. నిజం కాదంటారా?
జవాబు: ఆధార్‌ గత ఏడేళ్ల నుంచి ఉంది. ఎప్పుడూ సమాచారం లీక్‌ కాలేదు. ఆధార్‌ కార్డుదారుల సమాచారం భద్రంగా, సురక్షితంగాఉంది. ఆధార్‌ సమాచారం లీకయిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవం. మేం ఆధార్‌ సమాచార భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాం.  

యూఐడీఏఐ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement