దేశ రాజధాని ఢిల్లీ నగరంపై ఉగ్రవాదులు గురిపెట్టారా? అక్కడ భారీ ఎత్తున పేలుళ్లకు కుట్రలు పన్నారా? బుధవారం ఉదయం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా భావిస్తున్న దాదాపు 12 మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా చేసిన దాడుల్లో పట్టుకోవడంతో ఈ విషయం దాదాపు రుజువవుతోంది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, యూపీలోని దేవ్‌బంద్ ప్రాంతాలకు చెందినవారిని పోలీసులు అరెస్టుచేశారు. అరెస్టయిన వారిలో 8 మంది ఢిల్లీ చుట్టుపక్కల వారు కాగా, మరో నలుగురు దేవ్‌బంద్‌కు చెందినవారు. వాళ్ల దగ్గర నుంచి బాంబులు తయారుచేయడానికి ఉపయోగపడే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన పోలీసులు ఇద్దరు యువకులను తూర్పు ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో పట్టుకున్నప్పుడు వారి వద్ద ఐఈడీలు తయారుచేసే సామగ్రి దొరికింది. వారిని విచారించగా మిగిలినవాళ్ల విషయం కూడా తెలిసింది. వీళ్లంతా స్లీపర్ సెల్ సభ్యులని, దేశ రాజధాని సహా పలు నగరాల్లో బాంబు దాడులకు కుట్ర పన్నుతున్నారని ఓ అధికారి చెప్పారు. వీళ్లంతా జైషే మహ్మద్ నాయకుడు యూసుఫ్ అల్ హిందీతో టచ్‌లో ఉన్నారని, తమను తాము ఉగ్రవాద బృంద సభ్యులుగా చెప్పుకొంటున్నారని తెలిపారు.
ఢిల్లీపై ఉగ్రవాదుల గురి?
Published Wed, May 4 2016 2:44 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM
Advertisement