న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 10,994 మంది 24 గంటల్లో డిశ్చార్జి అయ్యారని కేంద్రం మంగళవారం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 2,48,189 మంది కోలుకున్నట్లయిందని, రికవరీ రేటు 56.38 శాతంగా ఉందని వెల్లడించింది. ఒక్క రోజులోనే 14,933 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,40,215కు చేరుకోగా మరో 312 మంది కోవిడ్‌తో మరణించడంతో ఇప్పటి దాకా చనిపోయిన వారి సంఖ్య 14,011కు ఎగబాకిందని వెల్లడించింది. దేశంలోని ప్రతి లక్ష మంది జనాభాలో ఒక్కరు మాత్రమే కోవిడ్‌తో చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతుండగా.. ప్రపంచ దేశాల్లో ఇది 6.04గా ఉందని తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కోవిడ్ మరణాల సంఖ్య రీత్యా ప్రపంచ దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. అదేవిధంగా, తీవ్ర ప్రభావిత దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ ఉంది.
కర్ణాటక మంత్రి కుటుంబంలో..
కర్ణాటక వైద్య విద్యా మంత్రి డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఆయన తండ్రి (82)కి సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, సుధాకర్ భార్య, కుమార్తెకు మంగళవారం పాజిటివ్‌గా వెల్లడైంది. ఇటీవల మంత్రి ఇంట్లో వంట మనిషికి కరోనా సోకింది. తనకు, ఇద్దరు కుమారులకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మిగతా అందరినీ కోవిడ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. బెంగళూరులోని సదాశివనగరలో ఉన్న మంత్రి నివాసంలో ఏడుగురు ఉండగా నలుగురికి కరోనా సోకింది.
Comments
Please login to add a commentAdd a comment