ఢిల్లీ పెద్దల పిలుపు.. బయల్దేరిన సీఎం, మంత్రులు
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తన ఇద్దరు మంత్రులతో కలిసి మంగళవారం ఉదయం రాజధాని ఢిల్లీకి బయల్దేరారు. జాట్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించటానికి ఏర్పాటుచేసిన కమిటీకి నాయకత్వం వహిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దానికి సంబంధించిన విషయాలను చర్చించేందుకు రమ్మని కబురుపెట్టడంతో హరియాణా పెద్దలు ఢిల్లీకి బయల్దేరారు. జాట్ల రిజర్వేషన్లపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ... ముందుగా హరియాణా ప్రభుత్వ అభిప్రాయాలను సేకరించనుంది.
రిజర్వేషన్లు కోరుతూ హరియాణాలో జాట్లు ఫిబ్రవరి 14న ఆందోళన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 18 మంది చనిపోగా, 200 మంది గాయపడ్డారు. హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి ఓపి ధనకర్, ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యుల ఇళ్లకు నిరసనకారులు నిప్పంటించారు. వీరిద్దరూ కూడా సీఎంతో కలిసి వెంకయ్యనాయుడును కలసేందుకు ఢిల్లీ వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వ హామీతో జాట్లు ఆందోళన విరమించినా... కొన్నిచోట్ల ఇంకా రోడ్ల నిర్బంధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ కావాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. ఢిల్లీనుంచి అంబాలా వెళ్లే జాతీయ రహదారి1, ఢిల్లీ నుంచి హరియాణా వెళ్లే నేషనల్ హైవే 10, పంజాబ్ నుంచి రాజస్థాన్ వెళ్లే దారులను సోమవారం కూడా నిరసనకారులు దిగ్బంధించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నారు. ఢిల్లీ రివారి జఝర్ రోడ్, నేషనల్ హైవే 1 లకు పారామిలటరీ బలగాలు మరమ్మత్తులు నిర్వహించాయి.