రెండేళ్లలో 2.2 లక్షల ప్రభుత్వ కొలువులు
లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: రెండేళ్ల కాల పరిమితిలో 2.2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం 2017 మార్చి 1 నాటికి వీటిని పూర్తిచేయాలని యోచిస్తోంది. 2015 మార్చి 1 నాటికి 33.05 లక్షలు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 34.93 లక్షలకు చేరింది. తాజాగా నిర్దేశించిన కాలానికి ఈ కొలువుల సంఖ్య 35.23 లక్షలకు పెరుగుతుందని అంచనా.
వీటిలో మూడేళ్లుగా ఒక్క నియామకం కూడా చేపట్టని రైల్వే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా రెవెన్యూ శాఖలో 70 వేలు, ఆ తరువాత పారామిలిటరీ దళాల్లో 47 వేలు, హోంశాఖలో 6 వేల పోస్టులు పెరిగాయి. కాగా, కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల సంఖ్య 538 నుంచి 472కు తగ్గడం విశేషం. ఇదిలావుంటే కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య ఏటికేడూ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆరు లక్షల ఖాళీలున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.