బాయ్‌ఫ్రెండ్‌తో బయటకెళ్లి.. | 21 Year Old Woman Fakes Kidnapping For Trip With Lover In Nagpur | Sakshi
Sakshi News home page

ఫేక్‌ కిడ్నాప్‌ : బాయ్‌ఫ్రెండ్‌తో బయటకెళ్లి..

Published Wed, Dec 25 2019 5:22 PM | Last Updated on Wed, Dec 25 2019 5:22 PM

21 Year Old Woman Fakes Kidnapping For Trip With Lover In Nagpur - Sakshi

నాగ్‌పూర్‌ : బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన ఓ యవతి..  ఇంట్లో ఈ విషయాన్ని దాచేందుకు కిడ్నాప్‌ నాటకం ఆడి అడ్డంగా దొరికిపోయింది.  ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఓ యువతి తల్లిదండ్రులు  సోమవారం నాగ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కళాశాలకు వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కారులో ఆమెను బలవంతంగా ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని.. ఈ క్రమంలో వారినుంచి ఆమె తప్పించుకొని సురక్షితంగా బయటపడిందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. అసలు కిడ్నాపే జరగలేదని, యువతి కావాలనే ఫేక్‌ కిడ్నాప్‌ స్టోరీని అల్లిందని తేల్చారు.

కిడ్నాపర్లు ఎక్కడికి తీసుకెళ్లారో యువతిని అడిగిన పోలీసులు ఆ ఘటనా స్థలానికి ఆమెను తీసుకొని వెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా  నాగ్‌పూర్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని యువతిని విచారించారు. ఈ క్రమంలో ఆమె చెప్పిన సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో అనుమానం వచ్చి కాలేజీ వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ రోజు తరగతులు పూర్తయిన తర్వాత యువతి ఓ వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు ప్రశ్నించగా తాను కట్టుకథ చెప్పినట్టు అంగీకరించిందని వివరించారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యువతి నాగ్‌పూర్‌ నగర శివారుకు వెళ్లిందనీ.. ఆ తర్వాత అతడే ఇంటి వద్ద వదిలి వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

తాను బయటకు వెళ్లినట్టు తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారని భయపడి యువతి ఈ కిడ్నాప్‌ నాటకమాడిందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌ చేశారని చెబితే విని ఊరుకుంటారని యువతి భావించిందనీ.. అయితే వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం డ్రామా బయటపడిందని వివరించారు. ఈ వ్యవహారంపై ఇంకా ఎలాంటి కేసూ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement