
కోల్‌కతా: మహారాష్ట్రలో 14 మంది వలస కార్మికులను పొట్టన పెట్టుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే వీరిలాగే మరో 24 మంది వలస కార్మికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతూ ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘటన శనివారం పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌కు వలస వచ్చిన కూలీలు తమ స్వస్థలమైన జార్ఖండ్‌లోని సహిబ్‌గంజ్‌కు బయలు దేరారు. (మమత సర్కారు కీలక నిర్ణయం)
అలా పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వీరు నల్హతి రైల్వే స్టేషన్ దగ్గర ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును గమనించలేదు. అయితే వీరిని గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వినియోగించి రైలును ఆపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అక్కడి అధికారులు కార్మికులను సహాయ శిబిరాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎవరూ పట్టాలపై నడవద్దని కోరారు. (కూలీలను చిదిమేసిన రైలు)