లక్నో : వివాహా వేడుకల్లో ఆహారం తిని 25 మంది తీవ్ర అనారోగ్యం పాలై వివిధ ఆసుపత్రిలో చేరారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మెహన్లాల్గంజ్ సమీపంలోని జబ్రౌలి గ్రామం సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా జరుగుతున్న వివాహం వేడుకల్లో పాల్గొనేందుకు బంధువులంతా తరలి వచ్చారు. అందులోభాగంగా రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత బంధువులు భోజనం చేశారు.
ఆ వెంటనే వారికి వరుస వాంతులు, విరోచనాలు అయి తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దీంతో వారిని సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని... అనారోగ్యం పాలైన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనారోగ్యం పాలైన వారిలో వృద్ధులతోపాటు చిన్నారులు కూడా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆహార పదార్థాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. పలువురి ఆరోగ్యం నిలకడగా ఉన్న మరికొంత మందిని మాత్రం పరిశీలనలో ఉంచినట్లు వైద్యుడు కె.పి.త్రిపాఠి చెప్పారు.