![27 Killed In Delhi Violence - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/27/New-Delhi_1.jpg.webp?itok=-I0D13Sy)
న్యూఢిల్లీ: రెండు రోజులుగా తీవ్ర స్థాయి హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వీధులన్నీ తగలబడిన వాహనాలు, ధ్వంసమైన, లూటీ అయిన దుకాణాలు, మూసివేసి ఉన్న ఇళ్లు, వాణిజ్య సముదాయాలతో నిర్మానుష్యంగా కనిపించాయి. గోకుల్‌పురిలో చోటు చేసుకున్న పలు చెదురుమదురు ఘటనలు మినహా బుధవారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మంగళవారం రాత్రి ఒకసారి, బుధవారం మరోసారి ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పర్యటించారు. (ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ )
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండగా భావిస్తున్న ఈ అల్లర్లలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 27కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. (‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’)
కాగా, అల్లర్ల కారణంగా చనిపోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మృతదేహాన్ని బుధవారం ఉదయం చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఒక కాలువలో గుర్తించారు. రాళ్ల దాడిలో ఆయన చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘సాధ్యమైనంత త్వరగా ప్రశాంతత నెలకొనాలి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై లోతైన సమీక్ష జరిపాం. పోలీసులు, ఇతర భద్రత వ్యవస్థలు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో ఉన్న రెండు రోజులు దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లతో అట్టుడికిన విషయం తెలిసిందే.
ఫ్లాగ్ మార్చ్
అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే బాధ్యతను అజిత్ దోవల్‌కు కేంద్రం అప్పగించిన నేపథ్యంలో.. అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కొత్తగా నియమితులైన స్పెషల్ కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాస్తవతో కలిసి దోవల్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. హింసను అడ్డుకోవడంలో విఫలమయ్యారని అమూల్య పట్నాయక్ విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. శ్రీవాస్తవను దోవల్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య 22కి పెరిగిందని, 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారని జీటీబీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు.
మృతులు, క్షతగాత్రుల సంఖ్యను పోలీసులు కాకుండా, వైద్యులు వెల్లడించడం గమనార్హం. అల్లర్ల కారణంగా ఈ ప్రాంతంలోని పాఠశాలలను, షాపులను మూసేశారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. దుకాణాలను లూటీ చేయడంతో జీవనోపాధి కోల్పోయిన పలు కుటుంబాలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవడం కనిపించింది. మరోవైపు, ఈ అల్లర్లకు సంబంధించి 106 మందిని అరెస్ట్ చేశామని, 18 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రజల సహాయం కోసం రెండు హెల్ప్‌లైన్ నెంబర్లు 011–22829334, 011–22829335 కూడా ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఐబీ ఉద్యోగి మృతి
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి అంకిత్ శర్మ మృతిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత అంకిత్ మళ్లీ బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని ఆయన తండ్రి దేవేంద్ర శర్మ తెలిపారు. అంకిత్ మృతదేహాన్ని మురికి కాలువలో వేయడాన్ని తమ కాలనీలోని కొందరు మహిళలు చూశారని, ఎవరికైనా చెపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ మహిళలను వారు బెదిరించారని అంకిత్ సోదరుడు అంకుర్ వెల్లడించారు. అంకిత్ శరీరంపై కత్తిగాట్లు కూడా ఉన్నాయన్నారు.
ఆర్మీని పిలిపించాలి
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం ఆర్మీని పిలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అల్లర్లను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. అల్లర్లకు కారణం బీజేపీ కార్యకర్తలేనని ఆప్ నేతలు సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ ఆరోపించారు. ఢిల్లీ శాంతి భద్రతల అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని, అల్లర్ల కట్టడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజాయితీగా కృషి చేయడం లేదని వారు విమర్శించారు. ఢిల్లీ సరిహద్దులను ఇప్పటికైనా మూసేయాలని, పొరుగు ప్రాంతాల నుంచి కొందరు ఢిల్లీకి వచ్చి హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అమిత్ షా రాజీనామా చేయాలి
రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీ అతలాకుతలమవడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బుధవారం సమావేశమైంది. ఈ ఘర్షణలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ హింసకు బాధ్యత వహించాలన్నారు. తర్వాత మీడియా సమక్షంలో కేంద్రానికి కొన్ని సూటిప్రశ్నలు సంధించారు.
► హింస జరుగుతుంటే అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎక్కడ? ఏం చేస్తున్నారు ?
► ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు సీఏఏ నిరసనలపై ఇంటెలిజెన్స్ సంస్థలు ఎలాంటి నివేదికలు ఇచ్చాయి?
► ఢిల్లీలో చెలరేగిన హింస హోంశాఖ చెబుతున్నట్టు అప్పటికప్పుడు జరిగినవా? లేదంటే హోంశాఖ సహాయ మంత్రి చెబుతున్నట్టు ఎవరైనా రెచ్చగొట్టినవా?
► ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగుతాయని స్పష్టమైన సంకేతాలు వచ్చినప్పుడు ఢిల్లీలో ఎన్ని బలగాలను మోహరించారు?
► ఢిల్లీ పోలీసుల చేతుల్లోంచి పరిస్థితులు జారిపోయినట్టు గ్రహించినప్పుడు భద్రతా సిబ్బందిని ఎందుకు మోహరించలేదు?
అమిత్ షా రాజీనామా కోరడం హాస్యాస్పదం: బీజేపీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ విమర్శించింది. పోలీసులతో కలిసి నిరంతరంగా పనిచేస్తూ ఢిల్లీలో పరిస్థితుల్ని అదుపులో ఉంచడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఢిల్లీ అల్లర్ల విషయం ప్రస్తావనకు రాలేదన్నారు.
వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి
సీఏఏపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనల నేపథ్యంలో రెచ్చగొట్టేలా ప్రసంగించిన బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఇందిరాగాం«ధీ హత్య సందర్భంగా 1984లో సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన హింసాకాండను ఈ దేశంలో పునరావృతం అయ్యేందుకు అనుమతించబోమని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. పౌరులందరికీ సంపూర్ణ భద్రత కల్పించాలని ఆదేశించింది.
అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించాలని అధికారులకు సూచించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించింది. అల్లర్లలో ఐబీ అధికారి మృతి చెందడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈశాన్య ఢిల్లీలో తలెత్తిన హింస నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రతిస్పందించిన తీరుని ఢిల్లీ హైకోర్టు ప్రశంసించింది. ‘మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్. మురళీధర్ వ్యాఖ్యానించారు. హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని సూచించింది. బాధితులు, వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది జుబేదా బేగంని నియమించింది.
ఆ వీడియోలు చూశారా?
సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలనీ జస్టిస్ మురళీధర్, జస్టిస్ తల్వంత్ బెంచ్ ఆదేశించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగం వీడియోని చూశారా? అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పోలీస్ కమిషనర్ (క్రైంబ్రాంచ్) రాజేష్ డియోలను కోర్టు ప్రశ్నించింది. అయితే ఆ వీడియో క్లిప్పింగ్స్‌ని తాను చూడలేదనీ తుషార్ మెహతా జవాబిచ్చారు. బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మల వీడియోలను తాను చూశాననీ, మిశ్రా వీడియోను మాత్రం చూడలేదని రాజేష్ డియో కోర్టుకి వెల్లడించారు. అనంతరం కోర్టులో బీజేపీ నేతల వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించారు.
సుప్రీం అక్షింతలు
హింసను సకాలంలో గుర్తించడంలో, విధి నిర్వహణలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ నిర్లక్ష్యం 20కి పైగా పౌరుల మరణానికి దారి తీసిందని పోలీసులను ధర్మాసనం మందలించింది. అయితే సీఏఏపై చెలరేగిన హింసకు సంబంధించిన అప్పీళ్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హింస చెలరేగిన సందర్భంలో ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడకుండా చట్టబద్దంగా వ్యవహరించాలని పోలీసులకు హితబోధ చేసింది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. షహీన్ బాఘ్ నిరసనలకు సంబంధించిన విషయాల్లోకి వెళ్ళడానికి ‘అనుకూల వాతావరణం అవసరమని’ వ్యాఖ్యానించింది.
ఘర్షణలు జరిగిన ప్రాంతం నుంచి వ్యాన్‌లో తరలిపోతున్న ముస్లింలు
Comments
Please login to add a commentAdd a comment