గత వారం జరిగిన ‘బలపరీక్ష’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ....
ముంబై: గత వారం జరిగిన ‘బలపరీక్ష’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోని బీజేపీ మైనారిటీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని మంగళవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఇప్పటివరకు ఈ విషయమై హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. కేతన్ తిరోడ్కర్, రాజ్‌కుమార్ అవస్తి అనే ఇద్దరు వ్యక్తులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. బలపరీక్షనాడు బీజేపీ సర్కారు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించిందని వారు తమ పిటిషన్‌లో ఆరోపించారు.
ఓటింగ్ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలైన శివసేన, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేసినా స్పీకర్ ఏమాత్రం పట్టించుకోకుండా మూజివాణి ఓటుతో ప్రభుత్వం బలపరీక్ష నెగ్గిందని ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్, సీఎంల పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కేతన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 288 కాగా, బీజేపీ ప్రభుత్వానికి 145 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కాగా, ఆ పార్టీకి 122 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 23 మంది సభ్యుల మద్దతుకు గాను ఆ పార్టీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీపై ఆధారపడాల్సి వచ్చింది. చిన్నచిన్న పార్టీలు, స్వతంత్రులను కలుపుకుపోదామన్నా వారి బలం తగినంత లేదు.