
బళ్లారిలో ఘోరం
సాక్షి, బళ్లారి (కర్ణాటక): బళ్లారిలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గంగావతి తాలూకాలోని చిల్లాయనగర్‌కు చెందిన సుభాషప్ప, అనిత దంపతులు సంచార జాతికి చెందినవారు. ఈ క్రమంలో బళ్లారికి వచ్చారు. అనిత కాన్పు కోసం పుట్టిల్లు మైసూరుకు వెళ్లింది. సుభాషప్పతోపాటు అతని తండ్రి, తల్లి, కుమార్తె, అతని అన్నపిల్లలు ఆదివారం రాత్రి బళ్లారిలోని కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో నిద్రించారు.
తండ్రి పక్కనే నిద్రిస్తున్న నిర్మల(4)ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. సుభాషప్పకు మెలకువ వచ్చినపుడు చూసుకోగా కుమార్తె కన్పించలేదు. సోమవారం స్థానిక గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగరంలోని అండర్‌బ్రిడ్జి వద్ద రైలు పట్టాల సమీపంలో బాలిక మృతదేహాన్ని పో లీసులు కనుగొన్నారు. మృతదేహం పడివున్న తీరు, ఒంటిపై గాట్లు, గాయాలను బట్టి అత్యాచారం చేసి.. ఆపై హతమార్చినట్లు అనుమానిస్తున్నారు.