నిరుద్యోగమే ప్రధానాంశం
భారత్‌లోనూ, అటు ఇండోనేసియాలో కూడా నిరుద్యోగమే ఎన్నికల్లో అతి పెద్ద అంశంగా మారబోతోంది. భారత్‌లో నిరుద్యోగం 20 ఏళ్లలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. మన దేశంలో దాదాపుగా రెండు కోట్ల మంది యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ హవాతో యువతరం బీజేపీ వైపే ఉంది. ఈసారి ఆ స్థితి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ‘మిలీనియల్స్’లో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి నెలకొంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే నిరుద్యోగం అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. అటు ఇండోనేసియాను నిరుద్యోగం పీడిస్తోంది. నిరుద్యోగం జాతీయ సగటు 5 శాతంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం ఉంది. రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న జొకో విదోదో ఈ సమస్య పరిష్కారానికి మళ్లీ పారిశ్రామీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని హామీలు ఇస్తున్నారు. ఏప్రిల్ 17న జరగనున్న ఎన్నికల్లో యువతరాన్ని ఆకర్షించేలా వ్యూహరచన చేస్తున్నారు.
మిలీనియల్స్..
1982 నుంచి 2001 మధ్య పుట్టినవారిని మిలీనియల్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం అందరి దృష్టి వీరి మీదే ఉంది.. ఎందుకంటే.. ఆసియాలో ఈ ఏడాది రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో జరగనున్న ఎన్నికలలో వీరు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఇలా భారత్, ఇండోనేసియాలో 50 కోట్ల మంది ‘మిలీనియల్స్’ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ దేశాలను నడిపించే నేతలెవరో తీర్పు చెప్పనున్నారు. భారత్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 20 నుంచి 34 ఏళ్ల వయసు మధ్యనున్న వారి సంఖ్య 26 శాతానికి పెరిగింది. 40 కోట్ల మందికిపైగా ‘మిలీనియల్స్’ మన దేశంలో ఓటు హక్కు కలిగిఉంటే, ఇండోనేసియాలో 7.9 కోట్ల మంది వినియోగించుకోబోతున్నారు. వీరంతా ఎవరికి ఓటు వేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఎందుకంటే ఈ తరం ఓటర్లు ఎవరి ప్రభావానికీ లోనుకాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోగల శక్తిమంతులు. అందుకే వారిని ఆకర్షించడం పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది.ఎన్నికలంటే కులం, మతం వంటివి అగ్రస్థానంలో ఉంటాయి.
ఈ యువ ఓటర్లను ఆకర్షించేవి మాత్రం ఆర్థికాంశాలే అనేది విశ్లేషకుల భావన.
నిరుద్యోగం తీర్చేవారివైపే యువతరం..?
2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న వారు గంపగుత్తగా బీజేపీకి ఓటు వేశారని పలు పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’(సీఎస్‌డీఎస్) చేసిన సర్వేలో యువ ఓటర్లలో బీజేపీ పట్టు కోల్పోతోందని తేలింది. ఏ ప్రభుత్వమైతే ఉద్యోగాల కల్పన దిశగా స్పష్టమైన హామీలు ఇవ్వడమే కాదు వాటిని అమలు చేస్తామన్న నమ్మకాన్ని కలగజేస్తుందో వారికే యువతరం ఓటు వేయనుందని ఆ సర్వే చెబుతోంది. గుజరాత్ సహా ఇటీవల జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారిని ఆకర్షించేలా వ్యూహాలు పన్నడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందన్న అంచనాలు ఉన్నాయి. రామమందిర నిర్మాణం, హిందూత్వకార్డు వంటి అంశాల కంటే ఆర్థికపరమైన అంశాలకే నేటి తరం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అది గ్రహించిన బీజేపీ ప్రభుత్వం చమురు ధరల్ని తగ్గించడం, జీఎస్టీలో 28 శాతం శ్లాబులో ఉన్న ఎన్నో వస్తువుల్ని 12 శాతం శ్లాబులోకి తీసుకురావడం వంటి చర్యల్ని తీసుకుంటోంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే సత్తా ఉన్న 40 కోట్ల మంది ‘మిలీనియల్స్’ ఈసారి ఏ పార్టీకి అండగా ఉంటారో, ఎవరిని అందలం ఎక్కిస్తారో? అన్నది ఆసక్తికరంగా మారింది.
స్వీయనిర్ణయం గలవారు..
మిలీనియల్స్‌లో ఎక్కువ మంది ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడ్డవారు. సొంతంగా ఆలోచనలు చేయగలిగిన శక్తి కలిగినవారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఆయా అంశాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారే. ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా తమకంటూ అభిప్రాయాలను కలిగి ఉన్నవారు.
మిలీనియల్స్‌లో అత్యధికులు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నవారే.
కల్పిత వార్తలే అడ్డంకి...
యువ ఓటర్లు సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక కాలం గడుపుతారు. ‘మిలీనియల్స్’ రోజుకు సగటున 5 నుంచి 6 గంటలు సోషల్ మీడియాలోనే ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు, విస్తృతంగా విషయ పరిజ్ఞానాన్ని కూడా నేటి తరం పెంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాను నకిలీ వార్తలు వరదలా ముంచెత్తుతూ ఉండటంతో ఏది అసలు, ఏది నకిలీ తేడా తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. రాజకీయ పార్టీలకు తమ పార్టీల పట్ల జరిగే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడం అతి పెద్ద సమస్యే. కేంబ్రిడ్జి అనలిటికా ఉదంతంతో ఫేస్‌బుక్ ఎన్నికల్ని ప్రభావితం చేయగలదన్న ఆందోళనలు అన్ని పార్టీల్లోనూ నెలకొన్నాయి. ‘మిలీనియల్స్’ను ఆకర్షించాలంటే సోషల్ మీడియా ప్రచారం ఒక్కటే సరిపోదు, కల్పిత వార్తలను కూడా తిప్పి కొట్టాలి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అదే పెద్ద అడ్డంకిగా మారనుంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment